బైజూస్ తో జగన్ ప్రభుత్వ ఒప్పందం ఎందుకంటే..!

Update: 2022-06-17 07:30 GMT
ప్రపంచంలో అతిపెద్ద ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ తో జగన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ ఇకపై ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు కూడా అందుబాటులోకి రానుంది. మంచి చదువులను నేర్పే దిశలో పిల్లలను ముందుండి నడిపించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. పదో తరగతిలో ఆంగ్ల మాధ్యమంలో సీబీఎస్‌ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి ఇది దోహద పడుతుందని సీఎం జగన్ చెబుతున్నారు. ఇదొక గేమ్‌ ఛేంజర్‌ అని అంటున్నారు.

బైజూస్ తో ఒప్పందం ద్వారా ఖరీదైన కంటెంట్‌ ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలందరికీ ఉచితంగా అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి బైజూస్‌ కంటెంట్‌ను ఇంగ్లిష్‌, తెలుగు మాధ్యమాల్లో పాఠ్య పుస్తకాలుగా అందుబాటులోకి తీసుకువస్తారు.

విజువల్‌ ప్రజెంటేషన్లు కూడా పిల్లలకు అందుబాటులోకి తేవడానికి ప్రతి తరగతి గదిలో నాడు-నేడు కింద టీవీ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2025 మార్చి నాటికి తమ 10వ తరగతి పరీక్షలను ఇంగ్లిష్‌ మీడియంలో సీబీఎస్‌ఈ నమూనాలో రాస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే వారిని నాణ్యమైన బోధనతో ముందుకు నడిపించడానికి బైజూస్ తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

ఇందులో భాగంగా సెప్టెంబర్‌ నాటికి 4.70 లక్షల మంది 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌ ఇస్తారు. ఈ విద్యార్థులకు 9, 10 తరగతుల్లోనూ ఈ ట్యాబ్‌ల ద్వారా ఈ-కంటెంట్‌ సులభంగా అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. విద్యార్థులకు ఏటా ట్యాబ్‌లు అందంచడానికి రూ.500 కోట్లు ఖర్చు చేస్తారని అంటున్నారు. కాగా బైజూస్ తో ఒప్పంద కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్, బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, పబ్లిక్‌ పాలసీ హెడ్‌ సుస్మిత్‌ సర్కార్‌ పాల్గొన్నారు. వర్చువల్‌ పద్ధతిలో ‘బైజూస్‌’ వ్యవస్థాపకుడు, సీఈవో రవీంద్రన్‌ అమెరికా నుంచి దీన్లో పాల్గొన్నారు.

బైజూస్‌తో ఒప్పందంలో ముఖ్యాంశాలు..
 
- ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు బైజూస్‌ యాప్‌తో పాటు అదనంగా ఇంగ్లిష్‌ లెర్నింగ్‌ యాప్‌ కూడా ఉచితంగా అందుబాటులోకి వస్తుంది.  

- మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ స్టడీస్‌ సబ్జెక్టులన్నీ ఇటు ఇంగ్లిష్‌లో, అటు తెలుగు మాధ్యమంలో కూడా అందుబాటులో
ఉంటాయి. ద్వి భాషల్లో పాఠ్యాంశాలు ఉండడం వల్ల పిల్లలు సులభంగా నేర్చుకునేందుకు, భాషా పరమైన ఆటంకాలు లేకుండా విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

- వినూత్న, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం వల్ల వీడియో పాఠ్యాంశాలు అత్యంత స్పష్టతతో, నాణ్యతతో ఉంటాయి.

- బైజూస్‌లో లెర్నింగ్‌ యాప్‌లో బోధన అత్యంత నాణ్యంగా ఉంటుంది. యానిమేషన్‌ ద్వారా, బొమ్మల ద్వారా విద్యార్థులకు మరింత సులభంగా, క్షుణ్ణంగా, సమగ్రంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది.

- 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, సామాన్య శాస్త్రం సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఇంటరాక్టివ్‌ గేమ్స్‌ కూడా యాప్‌లో ఉంటాయి.

- విద్యార్థి నేర్చుకున్న ప్రగతిపై నెల వారీగా ప్రోగ్రెస్‌ రిపోర్టులు కూడా ఇస్తారు. ఆన్‌లైలో ఉపాధ్యాయుడితో మీటింగ్‌ కూడా ఉంటుంది.

- తరచూ సాధన చేయడానికి వీలుగా మాదిరి ప్రశ్నపత్రాలు కూడా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి.
Tags:    

Similar News