పాత సామెత గుర్తు చేసేలా జర్నలిస్టులకు షాకిచ్చిన జగన్ సర్కార్

Update: 2021-12-20 06:57 GMT
కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలుక పోయిన చందంగా మారింది ఏపీలోని జర్నలిస్టుల పరిస్థితి. ఏదో అనుకుంటే మరేదో అయినట్లుగా.. చాలీచాలని జీతాలకు పని చేసే జర్నలిస్టులు.. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాన్ని మరింత వెసులుబాటు అయ్యేందుకు వీలుగా చేసిన విన్నపం రివర్సులోకి వెళ్లటమే కాదు.. ఉన్న కొద్దిపాటి సదుపాయం కూడా పోయిన వింత పరిస్థితి తాజాగా చోటు చేసుకుంది. ఏపీలోని జర్నలిస్టులకు తమ పిల్లలు చదువుకునే స్కూళ్లలో 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ గత ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ప్రభుత్వ.. ప్రైవేటు స్కూళ్లలోనూ అమలయ్యేలా ఈ ఆదేశాల్ని ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ నిర్ణయాన్ని కొన్ని స్కూళ్లు అమలు చేయటం లేదు. దీంతో.. ప్రభుత్వ ఆదేశాల్ని స్కూళ్లు అమలు చేయటం లేదని పేర్కొంటూ జర్నలిస్టు సంఘాల నేతలు డీఈవోకు ఫిర్యాదు చేశారు. పనిలో పనిగా ఇదే అంశాన్ని తమకున్న పరిచయంతో పాఠశాల విద్యా డైరెక్టర్ కు వినతిపత్రాన్ని ఇచ్చారు.

మామూలుగా అయితే.. జర్నలిస్టుల సమస్యపై వెంటనే నిర్ణయం వెలువడటంతో పాటు.. ప్రభుత్వ ఉత్తర్వుల్ని అమలు చేయాలని కాస్తంత ఘాటుగా రియాక్టు అవుతుందని అంచనా వేస్తారు. కానీ.. జగన్ ప్రభుత్వంలో అందుకు భిన్నమైన సీన్ చోటు చేసుకుంది.

ఇప్పటివరకు జర్నలిస్టు పిల్లలకు కల్పిస్తున్న 50 శాతం రాయితీని పూర్తిగా తొలగిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో.. కొండ నాలుక్కి మందు వేస్తే.. ఉన్న నాలుక పోయిన చందంగా మారిందంటున్నారు. దీనిపై పాత్రికేయ సంఘాలు సీరియస్ అవుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News