జ‌గ‌న్ లో ఇది గ‌మ‌నించారా?

Update: 2017-07-08 17:30 GMT
యడుగూరి సందింటి జగన్మోహనరెడ్డి... వైఎస్ జగన్... జగనన్న.. ఏ పేరైనా, ఎలా పిలుచుకున్నా ఆ పేరు వింటే తెలుగు ప్రజల్లో కనిపించే అభిమానం, ఆదరణ వేరు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిగా ఆయన పట్ల కురిపించే ప్రేమాభిమానాలకు కొదవే లేదు. జగన్ వ్యక్తిగతంగా ఎంత ఎదిగినా తరచూ తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆయన్ను స్మరించుకుంటూనే ఉంటున్నారు. రాజన్న కొడుకుగా జనం ఆయన్ను ఆదరించారు.. ఇప్పుడు జగన్ ను జనం రాజన్న కొడుకుగానే కాదు జగనన్నగా పిలుచుకుంటూ తమ సొంత అన్నదమ్ముడిలా భావిస్తున్నారు. రాజన్నలా మళ్లీ తమకు మంచి చేసేది జగనన్నే అనుకుంటూ ఆ రోజు కోసం చూస్తున్నారు.
    
తండ్రి పేరుతో తెరపైకొచ్చి మూణ్నాలుగేళ్లు అదే నామస్మరణతో సాగుతూ విపక్షనేత స్థాయికి ఎదిగిన జగన్ కు ఇప్పుడు పూర్తిగా సొంత ఇమేజి ఉంది. అయినా, అదే అణకువ - అదే తీరు. తండ్రి దీవెనలు ఉన్నా అంతా తానై అధికార పార్టీకి సవాల్ గా నిలిచిన ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిలిపిన ధీరుడాయన.
    
ఈ ఏడేళ్లలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎంతగా అణగదొక్కాలని చూసినా, కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసినా కూడా అన్నిటికీ తట్టుకుని నిలిచి జనాభిమానాన్ని అలాగే నిలబెట్టుకోవడం జగన్ సాధించిన అతి పెద్ద విజయాల్లో ఒకటి. ఆయన పట్ల జనాభిమానం రోజురోజుకీ పెరుగుతుందే కానీ, ఇసుమంతైన తగ్గిన దాఖలాలు లేవని ప్రత్యర్థుల సర్వేల్లో సైతం తేలిన సందర్భాలున్నాయి.
    
ఇంతింతై వటుడింతై అన్నట్లుగా జగన్ ఇప్పుడు ఈ పార్టీ ప్లీనరీతో వైసీపీ శ్రేణులను వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. గుంటూరులో నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద నిర్వహిస్తున్న ఈ ప్లీనరీ పాలక పక్షానికి చెమటలు పట్టిస్తోందంటే జగన్ ఏ స్థాయి నేతగా ఎదిగారో... ప్రజాదరణలో ఎలా దూసుకుపోతున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
    
రాజశేఖర్‌ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినా... తండ్రి మరణంతో రాజకీయ ప్రత్యర్థులకు లక్ష్యమై చిన్నవయసులోనే ఒంటరి పోరాటం చేసి రాటుదేలాడు జగన్. ఓదార్పు యాత్రతో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ కు కంటగింపై 16 నెలల జైలు శిక్ష కూడా అనుభవించిన జగన్ జనం దృష్టిలో హీరోగానే ఉన్నారు. తనకు ఎదురే లేదని భావించే టీడీపీకి ఏకైక ప్రత్యామ్నాయంగా వైసీపీని జనం పార్టీగా మలచిన జగన్ రాజకీయ నేతగానూ ఎంతో పరిణతి సాధించారు.
    
ఇటీవల కాలంలో రాష్ర్టంలో ఏర్పడిన పలు సమస్యలపై జగన్ స్పందించిన తీరు, ఆయన వ్యవహార శైలి, సత్వర స్పందనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. గరగపర్రులో రెండుకులాల మధ్య జరిగిన ఘర్షణ విషయంలో పాలక టీడీపీ గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్న సమయంలో జగన్ అక్కడికి వెళ్లి, రెండు వర్గాలతో సామరస్యపూర్వక చర్చలు జరిపి సంధి కుదిర్చేందుకు ప్రయత్నించారు. మలేరియాతో 16 మంది గిరిజనులు మృతి చెందిన చాపరాయికి వెళ్లి వర్షంలోనే అక్కడ పర్యటించి జనం కోసం తాను వ్యక్తిగత ఇబ్బందులను పట్టించుకోని నేతనని చాటుకున్నారు. కిడ్నీబాధితుల సమస్య, హంద్రీ-నీవా ప్రాజెక్టు నుంచి అనంతకు సాగునీరు, రుణమాఫీ, భూ అక్రమాలు, బస్సు ప్రమాదాలు ఇలా.. ప్రతి విషయంలోనూ జగన్ జనం పక్షమే వహించారు. ఇలా, జనం కోసం జగన్... జగన్ కోసం జనం దేనికైనా సిద్ధమవుతుండడంతో ప్రత్యర్థి పార్టీలు కంగారు పడుతున్నాయి.
Tags:    

Similar News