జ‌గ‌న్‌ కు కొత్త స‌మ‌స్య‌

Update: 2015-08-28 06:03 GMT
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ కు కొత్త స‌మ‌స్య మొద‌లైంది. పార్టీని సంస్క‌రించ‌డంలో భాగంగా..బెజవాడ కార్పొరేషన్‌ లో వైసీపీ నేత‌లు కార్పొరేట‌ర్ల‌తో జ‌గ‌న్ స‌మావేశం అయ్యారు. అక్క‌డంతా స‌వ్యంగా ఉంది అనుకుంటే... వైసీపీ కార్పొరేటర్లు కడుపులో చాలాకాలంగా దాచుకున్న విషయం బయటపడింది. కాస్త తీరిక  దొరకటంతో పార్టీ ప‌టిష్ట‌త‌పై దృష్టిసారించిన జ‌గ‌న్ బెజ‌వాడ‌లో కార్పొరేటర్లతో సమావేశం పెట్టుకున్నారు. కార్పొరేషన్‌ లో ఉన్న 19 మంది కార్పొరేటర్లు, నియోజకవర్గాల ఇంఛార్జ్‌ లు ఈ  మీటింగ్‌ కు వచ్చారు. తొలిసారి పార్టీ అధినేతతో మీటింగ్‌ కావటంతో పరిచయాలు, కుశల ప్రశ్నలతో సరిపెడతారని అంతా  అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో కార్పొరేటర్లు ఫిర్యాదుల చిట్టా విప్పారట.

పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ పుణ్యశీలపై వైసీపీ కార్పొరేటర్లు ఎదురుతిరిగారని తెలుస్తోంది. అధికార పక్షానికి ఆమె సహకరిస్తున్నారని ఆగ్రహించారట. అధికార పక్షానికి అనుకూలంగా మెతకవైఖరి అవలంబిస్తున్నారని జగన్‌ కి ఫిర్యాదుచేశారట. ఏఏ సందర్భాల్లో అధికార పక్షానికి అండగా నిలిచారో పూసగుచ్చినట్లు అధినేతకు చెప్పుకొచ్చారని సమాచారం. ఫ్లోర్‌ లీడర్‌ వల్ల ముఖ్యమైన విషయాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నామని జగన్‌  దృష్టికి తీసుకొచ్చారట. అంతేకాదు... అధికార పార్టీకి అనుకూలంగా నడుచుకోవాలని పార్టీ కార్పొరేటర్లకు పరోక్షంగా ఫ్లోర్‌ లీడర్‌  వారు ఫిర్యాదుచేశారని సమాచారం. వైసీపీ కార్పొరేటర్లు నియోజకవర్గ ఇంఛార్జ్‌ లపైనా ఫిర్యాదులు  చేశారని తెలుస్తోంది. తమను అస్సలు పట్టించుకోవటం లేదని, పార్టీ కార్యక్రమాల సమాచారం అందించటం లేదని ఏకరువు  పెట్టారట. వీరిని వెంటనే మార్చెయ్యాలని కార్పొరేటర్లంతా ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారని సమాచారం.

తొలిసారి నిర్వహించిన సమావేశంలోనే కార్పొరేటర్లంతా మూకుమ్మడి ఫిర్యాదులు చేయడంతో జగన్‌ సైతం ఆశ్చర్యపోయారట.  ఇలా చేస్తే ప్రతిపక్ష పాత్రను ఎలా పోషించగలరంటూ స్థానిక నేతలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌ లకు చిన్నపాటి క్లాస్‌ కూడా తీసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే పరిశీలకుల్ని నియమించి మరిన్ని విషయాలు తెలుసుకుంటానని, ఆ తర్వాత ఏం చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని జగన్‌ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద తొలి మీటింగ్‌ లోనే అధినేతకు బెజవాడ వైసీపీ నేతలు ఊహించని షాక్‌ ఇచ్చారన్న చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News