ఆకర్ష్ పై జగన్ మైండ్ గేమ్

Update: 2016-04-18 17:30 GMT
నిండా మునిగిపోతున్న నావను కాపాడుకోవటానికి అధినేత ఏదో ఒకటి చేయాల్సిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఆస్త్రాన్ని తిప్పి కొట్టేందుకు కొద్దికాలంగా కిందామీదా పడిన ఆయన.. చివరకు ఒక వ్యూహాన్ని సిద్ధం చేసినట్లుగా కనిపిస్తోంది.

ఆపరేషన్ ఆకర్ష్ ను షురూ అయిన మొదట్లో జగన్ పార్టీ నేతలు ఎవరికి వారు జిల్లాల వారీగా పార్టీ పట్ల తమకున్న విధేయతను ప్రదర్శించేలా మీడియాతో మాట్లాడేవారు. ఓపక్క ఆ వ్యవహారం సాగుతునే ఉన్నా.. మరోవైపు పార్టీని విడిచి పెట్టి వెళ్లే వారు వెళుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. తమ విధేయను చాటుకునే ప్రయత్నం కొద్దికాలంగా ఆగిపోయింది. అప్పటి నుంచి జగన్ మాత్రమే ఈ అంశం మీద మాట్లాడేవారు. తాజాగా మరోసారి తన వ్యూహాన్ని మార్చిన జగన్.. పార్టీ ముఖ్యనేతలందరి చేత ఆపరేషన్ ఆకర్ష్ చేత మాట్లాడించటం మొదలు పెట్టారు.

కాకుంటే.. ఒక పెద్ద నేత గురించి పలువురు నేతలు గొప్పగా మాట్లాడటం.. ఆయన తరఫున వకల్తా పుచ్చుకున్నట్లుగా తమ సీనియర్ నేత ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారరంటూ తేల్చి చెప్పటమే కాదు.. వారిని కీర్తించటం కనిపిస్తుంది. మరోవైపు.. రోజా లాంటి ఫైర్ బ్రాండ్ చేత ఏపీ ముఖ్యమంత్రిని తిట్టించటం కనిపిస్తుంది. ఆకర్ష్ తో పార్టీ మనుగడకు పొంచి ఉన్న ముప్పును గుర్తించిన జగన్.. తనకు విధేయతతో వ్యవహరిస్తున్న నేతల్ని అధికారపక్షంపై ఎదురుదాడికి పురికొల్పినట్లుగా కనిపిస్తోంది.

ఈ వ్యూహానికి తగ్గట్లే వైఎస్సార్ పార్టీకి చెందిన నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ మరే పార్టీలో ఉండదని తెలంగాణ పార్టీ అధ్యక్షుడు పొంగులేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించటం గమనార్హం. మరోవైపు.. మారతారని బలంగా ప్రచారం జరుగుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి మాట్లాడుతూ.. పెద్దిరెడ్డికి సీఎం పదవిని ఆఫర్ చేసినా పార్టీ నుంచి మారే అవకాశమే లేదని చెప్పటం విశేషం. వీరే కాక పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు గళం విప్పటం చూస్తుంటే.. ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా జరిగే నష్టాన్ని వీలైనంత తగ్గించుకోవాలన్న లక్ష్యంతో జగన్ ఉన్నట్లు కనిపిస్తోంది.
Tags:    

Similar News