జ‌గ‌న్ సంచ‌ల‌నం!..25 జిల్లాల రాష్ట్రంగా న‌వ్యాంధ్ర‌!

Update: 2019-01-09 17:38 GMT
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ముగింపు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. 14 నెల‌ల పాటు ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై 3,648 కిలో మీట‌ర్ల మేర సుదీర్ఘ పాద‌యాత్ర చేసిన జ‌గ‌న్‌... జ‌నం ప‌డుతున్న ఇబ్బందులు, వారికి ఎదురవుతున్న స‌మ‌స్య‌లను ద‌గ్గ‌ర‌గా చూశారు. అదే అంశాన్ని త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించిన జ‌గ‌న్‌... ఆ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పైనా త‌న‌కు సంపూర్ణ అవ‌గాహ‌న వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. ఇక పాద‌యాత్ర‌లో భాగంగా ఇప్ప‌టికే ఆయా స‌మ‌స్య‌ల‌పై ఎక్క‌డిక‌క్క‌డ ప‌రిష్కార మార్గాల‌ను జ‌గ‌న్ ప్ర‌క‌టించిన విష‌యం కూడా తెలిసిందే. ఇక ఇచ్ఛాపురం బ‌హిరంగ స‌భా వేదిక‌పై నుంచి త‌న ప్ర‌ణాళిక‌ల‌పై విస్ప‌ష్ట ప్ర‌క‌ట‌న చేసిన జ‌గ‌న్‌... రాష్ట్రంలో పాల‌న‌ను సుల‌భ‌త‌రం చేసేందుకు అవ‌స‌ర‌మైన కీల‌క అంశాన్ని ప్ర‌స్తావించారు. తాను అధికారంలోకి వచ్చిన త‌ర్వాత రాష్ట్రంలోని 13 జిల్లాల‌ను 25 జిల్లాలుగా విభ‌జిస్తాన‌ని జ‌గ‌న్ చెప్పారు.

ఈ ప్ర‌క‌ట‌న ఓ సాహ‌సోపేత ప్ర‌క‌ట‌న అనే చెప్పాలి. ఎందుకంటే... జిల్లాల విభ‌జ‌న అంత ఈజీ స‌మ‌స్య కాదు. ఎందుకంటే అందుబాటులో ఉన్న అధికార యంత్రాంగంతోనే రాష్ట్ర పాల‌న‌ను నెట్టుకురావాల్సి ఉంటుంది. కొత్త జిల్లాల ఏర్పాటు అంటే... ఎన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే ఆ మేర అద‌నంగా అధికార యంత్రాంగం కూడా అవ‌స‌ర‌మ‌వుతుంది. జిల్లా స్థాయి అధికారుల కొర‌త చాలా ఇబ్బంది క‌లిగించ‌డం ఖాయం. అయితే చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్ర‌జామోద పాల‌న‌ను అందించే వెసులుబాటు దొరికేసిన‌ట్టే. ఈ కార‌ణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే... తొలి సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన త‌ర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అప్ప‌టిదాకా 10 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని ఏకంగా 31 జిల్లాల రాష్ట్రంగా మార్చేశారు. అధికార యంత్రాంగం కొర‌త‌ను చాలా మంది ప్ర‌స్తావించినా... ప్ర‌జల‌కు సుప‌రిపాల‌నే ల‌క్ష్య‌మని స‌మాధానం ఇచ్చిన కేసీఆర్ తాను అనుకున్న‌ది చేసుకుపోయారు. తాజాగా మ‌రో రెండు కొత్త జిల్లాల‌ను కూడా ప్ర‌తిపాదించిన కేసీఆర్ త్వ‌ర‌లోనే తెలంగాణ‌ను 33 జిల్లాలున్న రాష్ట్రంగా మార్చ‌బోతున్నారు.

ఈ త‌ర‌హా చ‌ర్య‌ల‌న్నింటినీ గ‌మ‌నిస్తూనే సాగిన జ‌గ‌న్... ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందాల‌న్న ఏకైక ల‌క్ష్యంతో కొత్త జిల్లాల ప్ర‌క‌ట‌న చేశార‌ని చెప్పాలి. అది కూడా త‌న పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా జ‌గ‌న్ ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారంటే... దానిపై ఇప్ప‌టికే ఆయ‌న క‌స‌ర‌త్తు పూర్తి చేసి ఉంటార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. కొత్త జిల్లాలు అంటేనే... ఠ‌క్కున కేసీఆర్ గుర్తుకు వ‌స్తున్నా... చిన్న జిల్లాల‌తో ప్ర‌జ‌ల‌కు మంచి పాల‌న అందించాల‌న్నదే అంతిమ ల‌క్ష్యంగా జ‌గన్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి స‌భ‌లో జ‌గ‌న్ ఏం మాట్లాడార‌న్న విష‌యానికి వ‌స్తే... తాము అధికారంలోకి వస్తే ప్రతీ పార్లమెంటును ఓ జిల్లాగా చేస్తానని జగన్ ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 25 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను 25 జిల్లాలుగా విభ‌జించి... 25 జిల్లాలతో కొత్త ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తానని ఆయ‌న చెప్పారు. త‌ద్వారా కలెక్టర్ల వ్యవస్థను ప్రజలకు దగ్గరగా చేస్తానని జ‌గ‌న్‌ చెప్పారు. పంచాయ‌తీల వ్య‌వ‌స్థ‌నూ ప్ర‌స్తావించిన జ‌గ‌న్‌... పంచాయతీలను బలోపేతం చేస్తానని ప్ర‌క‌టించారు. ప్రతీ గ్రామంలో గ్రామ సచివాలయం తీసుకు వస్తానని, అందులో ప‌ది మంది స్థానికుల‌కు ఉద్యోగాలు ఇచ్చి ప్ర‌భుత్వ పాల‌న‌ను గ్రామాల్లోకి, గ్రామ ప్ర‌జ‌ల ఇళ్ల ముంగిట్లోకి తీసుకువ‌స్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. కొత్త జిల్లాలపై జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై ఇప్పుడు స‌ర్వత్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.



Tags:    

Similar News