ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు!

Update: 2019-08-01 14:30 GMT
కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని ఆశించడం గురించి విశ్లేషకులు ఈ వ్యాఖ్య చేస్తూ ఉన్నారు. మోడీ సర్కారు రాష్ట్రాలకు సహకారం అందించడం దుర్లభం అని తేలిపోయిందని పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ సాయంగా నిలిచే అవకాశాలు కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తమకు సీట్లను ఇచ్చేది ఉత్తరాది రాష్ట్రాలు - గుజరాత్ కాబట్టి ఆ రాష్ట్రాలకే తమ ప్రాధాన్యత అన్నట్టుగా మోడీ సర్కారు వ్యవహరిస్తూ ఉంది. సౌత్ రాష్ట్రాలకు పూర్తిగా మొండి చేయి చూపుతూ ఉంది. ఆఖరికి ఏపీకి తాము ఎన్నికల హామీగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని కూడా మోడీ తుంగలో తొక్కిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందించదని స్పష్టం అవుతోంది. ఒకవైపు ఏపీలో బలోపేతం కావాలని కలలు కంటున్నా భారతీయ జనతా పార్టీ ఏపీకి ఆర్థిక సాయం విషయంలో మాత్రం దొంగ మాటలే మాట్లాడుతూ ఉందని విశ్లేషకులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా పరిస్థితికి అనుగుణంగా స్పందించాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలను - ప్రధానిని - కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసినా వారు సాదరంగా ఆహ్వానించి ఫొటోలు దిగే అవకాశాలున్నాయి. అయితే ఆర్థిక సాయం మాటెత్తితే మాత్రం ఏపీతో తమకు సంబంధం లేదన్నట్టుగా వారు వ్యవహరించే అవకాశాలున్నాయని తేటతెల్లం అవుతోంది.

ఈ నేపథ్యంలో ఈ పరిణామాలను కేసీఆర్ బాగానే అర్థం చేసుకున్నట్టున్నారు. రాష్ట్రం చేతిలో ఉండే అంశాల ద్వారానే కేసీఆర్ ఆర్థిక వనరులను సృష్టించుకుంటూ ఉన్నారు. వాటితోనే సంక్షేమ - అభివృద్ధి పథకాలను అమలు చేసుకుంటూ సాగుతూ ఉన్నారు. ప్రధానంగా మద్యం అమ్మకాలు తెలంగాణ సర్కారుకు ఆదాయం తెచ్చి పెడుతున్నాయి. అలాగే రియలెస్టేట్ రిజిస్ట్రేషన్ల ఫీజుల ఆదాయం ఉంది. అలా కేసీఆర్ ఆర్థిక వనరులను సృష్టించుకుంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి కూడా ఇక ఆదాయ వనరులను సొంతంగా సృష్టించుకునే మార్గాలను అన్వేషించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. కేంద్రం మీద ఆధారపడి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Tags:    

Similar News