కొత్త పాచిక‌తో రెడీ అవుతున్న జ‌గ‌న్

Update: 2016-02-27 07:12 GMT
అధికార తెలుగుదేశంలోకి పెద్ద ఎత్తున జ‌రుగుతున్న వ‌ల‌స‌లను అడ్డుకునేందుకు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కొత్త స్కెచ్ వేశారు. పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు - ఓ ఎమ్మెల్సీ ఇప్ప‌టికే టీడీపీ కండువా క‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. మరికొంత మంది ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్‌ లో ఉన్నార‌ని...రేపో మాపో వారు కూడా సైకిలెక్కడం ఖాయ‌మ‌ని అధికార టీడీపీ నేత‌లు ఘంటాప‌థంగా చెప్తున్నారు. దీంతో పార్టీ నేత‌ల‌ను కాపాడుకునేందుకు జగన్ రంగంలోకి దిగారు. మొదట సొంత జిల్లా క‌డ‌ప నేత‌ల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వహించిన జ‌గ‌న్ అనంత‌రం ప్ర‌కాశం - గుంటూరు జిల్లా నేత‌ల‌తో మాట్లాడారు. ఈ క్ర‌మంలో మ‌రో క్రియాశీల అడుగులు వేస్తున్నారు.

పార్టీ మార‌కుండా నేత‌ల‌ను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా జ‌గ‌న్ మ‌రింత వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త్వరలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్ పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎమ్మెల్యేల వలసలపై ఇందులో  ప్ర‌ధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలకు పార్టీ పరంగాను, రాజకీయపరంగాను, వ్యక్తిగతంగాను ఎదురవతున్న సమస్యలపై క్లారిటీ ఇచ్చి  స్వయంగా ఎమ్మెల్యేలకు జ‌గ‌న్ నచ్చచెప్పనున్నారు. దీంతో పాటు జిల్లాల వారీగా వలసలను నియంత్రించే బాధ్యతలను పార్టీ సీనియర్లకు అప్పగించే యోచనలో వైసీపీ అధినేత‌ ఉన్నారని స‌మాచారం.

పార్టీ అగ్ర‌నేత‌లైన‌ బొత్స స‌త్యనారాయ‌ణ‌ - విజయసాయిరెడ్డి - ధర్మాన ప్ర‌సాద‌రావు - జ్యోతుల నెహ్రూ - బాలినేని శ్రీ‌నివాసరెడ్డి - అనంత వెంకట్రామిరెడ్డి - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి నేతలకు బుజ్జగించే బాధ్యతలు అప్పగిస్తారని స‌మాచారం. జంపింగ్‌ ల లిస్ట్‌లో ఉన్న నాయ‌కుల‌ను గుర్తించిన‌ వారిలో భ‌రోసా నింపేందుకు ఈ ముఖ్య‌నేత‌లు ప్ర‌య‌త్నం చేస్తార‌ని వైసీపీ వ‌ర్గాలు వివ‌రిస్తున్నాయి. పార్టీని ప‌టిష్టం చేసుకునేందుకు జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఎంత‌మేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి మ‌రి.
Tags:    

Similar News