కొడాలి నానికి ప్ర‌మోష‌నిచ్చిన జ‌గ‌న్‌

Update: 2016-05-19 04:31 GMT
వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించే క‌మ్మ కుల‌స్తుల‌ను ద‌గ్గ‌ర చేసుకునేందుకు కీల‌క అడుగులు వేశారు. డైన‌మిక్‌ గా వ్య‌వ‌హ‌రించ‌డంలో ముందుండే గుడివాడ‌ ఎమ్మెల్యే కొడాలి నానిని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. మ‌రోవైపు  కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొలుసు పార్థసారథిని నియమించారు. కొడాలి నానికి కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు ఉన్నాయ‌ని చెప్తున్నారు.

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ తాత్కాలిక‌ రాజ‌ధాని అయిన విజ‌య‌వాడ‌, భ‌విష్య‌త్తులో రాజ‌ధానిగా అమ‌రావ‌తి రూపొంద‌నున్న నేప‌థ్యంలో అక్క‌డ ఉన్న‌ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల రీత్యా కొడాలి నానికి ఈ అవ‌కాశం క‌ట్ట‌బెట్టార‌ని చెప్తున్నారు. దీంతో పాటు క‌మ్మ కుల‌స్తుల‌కు తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామ‌నే సందేశాన్ని పంపించేందుకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వంటి కీల‌క‌మైన ప‌ద‌విని ఇచ్చార‌ని వైసీపీ వ‌ర్గాలు చెప్తున్నాయి. ఇదే స‌మ‌యంలో తెలుగుదేశంను దూకుడుగా ఎదుర్కోవ‌డంలో కూడా ముందుండే నానికి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి మ‌రింత బాధ్య‌త‌ను ఇవ్వ‌డం ద్వారా అదే డైన‌మిజంతో ముందుకు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కాపు కుల‌స్తుల‌ను ద‌గ్గ‌ర చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అడుగులు వేస్తున్న క్ర‌మంలో అదే రీతిలో క‌మ్మ కుల‌స్తుల కోసం జ‌గ‌న్ ఈ ర‌కంగా నియ‌మ‌కాలు చేప‌ట్టార‌నే మ‌రో వాద‌న కూడా పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో వినిపిస్తోంది.
Tags:    

Similar News