విశాఖలో ఏపీ సీఎం నివాసం ఎక్కడంటే?

Update: 2020-01-07 06:09 GMT
రాజధాని తరలిస్తారా? లేదా? అన్నప్రశ్న పెద్ద  ఎత్తున వినిపిస్తున్నా.. మరోవైపు మాత్రం రాజధాని తరలింపు ప్రక్రియ ఇప్పటికే జరిగిపోయిందన్న మాట వినిపిస్తోంది. అధికారికంగా అనౌన్స్ చేయటం.. దాన్నిఅమలు కార్యక్రమాన్ని షురూ చేయనట్లు కనిపించినా.. మరోవైపు ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నట్లుగా చెప్పాలి. అమరావతి నుంచి విశాఖకు రాజధానిని మార్చినంతనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బస చేస్తారు? సీఎం అధికారిక నివాసం ఎక్కడ ఉంటుంది? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఇప్పటికే ఈ విషయం మీద పెద్ద ఎత్తున కసరత్తు చేసిన అధికారులు.. కొన్నిప్రత్యామ్నాయాల్ని సిద్ధం చేసినట్లుగా సమాచారం. పలు భవనాల్ని చూసినప్పటికీ.. కట్టుదిట్టమైన భద్రతకు అనువుగా ఉండే ప్రదేశాల కోసం వారు వెతుకుతున్నారు. అయితే.. అధికారులు కోరుకున్నట్లుగా ఇల్లు లభించని నేపథ్యంలో.. గెస్ట్ హౌస్ లలో సీఎం నివాసాన్ని ఏర్పాటు చేయాలని భావించారు.

కానీ.. అది కూడా సాధ్యం కాకపోవటంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక హోటల్లో తాత్కాలికంగా ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా తగిన ఇల్లు కోసం వెతికినప్పటికీ.. అలాంటి భవనాలు ఏమీ అధికారులకు కనిపించటం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఒక స్టార్ హోటల్లో కొన్ని నెలలు బస చేస్తారని.. ఇందుకు తగ్గట్లుగా సదరు హోటల్ లో రిపేర్లు చేయిస్తున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు.. అమరావతికి దగ్గర్లో ఎలా అయితే.. జగన్ సొంతింటిని నిర్మించుకున్నారో.. అదే రీతిలో విశాఖలోనూ మరో ఇంటిని నిర్మించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం నగర శివారులో కానీ..కొండ ప్రాంతంలో కానీ సీఎం నివాసం ఏర్పాటు చేస్తే.. భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. మధురవాడ.. భీమిలి.. కాపులుప్పాడ.. తిమ్మాపురం తదితర ప్రాంతాల్లో స్థలాల కోసం వెతుకుతున్నారు. తమకు అనుకూలంగా ఉండే భూమి కనిపించిన తర్వాత సీఎం సొంతింటి నిర్మాణం సాగుతుందని చెబుతున్నారు. అయితే.. ఈ విషయాలేవీ బయటకు రాకుండా అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు.


Tags:    

Similar News