తెలుగు రాష్ట్రాలకు నిరాశ.. సాధారణ కేటాయింపులతో మమ

ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నందున బడ్జెట్ ను ప్రశంసిస్తున్నారని, కానీ ఈ బడ్జెట్ వల్ల ఏపీకి ప్రత్యేకంగా ఒనగూరేదేమీ లేదన్న విమర్శే ఎక్కువగా వినిపిస్తోంది.

Update: 2025-02-01 13:16 GMT

కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగువారి కోడలైన ఆర్థిక మంత్రి సీతారామన్.. తన బడ్జెట్ ప్రసంగంలో తెలుగు కవితా పితామహుడు గురజాడను గుర్తు చేస్తూ ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనషులోయ్’ అని ప్రస్తుతించినా రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదన్న ఆవేదనే ఎక్కువగా వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా ఈ బడ్జెటులో ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటిస్తారని అంతా ఆశించారు. ప్రధాని మోదీ 3.0 ప్రభుత్వం కొనసాగే విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీకి బడ్జెట్ పై పైకి చెప్పలేక.. లోపల మింగలేక అన్న పరిస్థితిని ఎదుర్కొంటోందని అంటున్నారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నందున బడ్జెట్ ను ప్రశంసిస్తున్నారని, కానీ ఈ బడ్జెట్ వల్ల ఏపీకి ప్రత్యేకంగా ఒనగూరేదేమీ లేదన్న విమర్శే ఎక్కువగా వినిపిస్తోంది. అదేవిధంగా తెలంగాణకు కూడా ప్రభుత్వం మొండి చేయే చూపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక చోట బీజేపీ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం ఉన్నా ఎప్పటిలానే వివక్షే ఎదురైందని అంటున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో ఆ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులేవీ ఇవ్వలేదన్న విమర్శ వినిపిస్తోంది.

ముఖ్యంగా ఏపీలో విజయవాడ, విశాఖ మెట్రో ఏర్పాటుకు కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తుందని అంతా ఆశించారు. అదేవిధంగా తెలంగాణలో మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు ఆర్థిక సాయం ప్రకటిస్తారని ఎదురుచూశారు. కానీ, బడ్జెట్ లో వీటి ప్రస్తావనే వినిపించలేదు. తన బడ్జెట్ ప్రసంగంలో పదేపదే బిహార్ రాష్ట్రం పేరు ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక మంత్రి రెండు తెలుగు రాష్ట్రాల పేరును ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. బిహార్ ఎన్నికలను పరిగణలోకి తీసుకుని ఆ రాష్ట్రానికి ఎక్కువ ప్రాజెక్టులు కట్టబెట్టారు. తమది వెనుకబడిన రాష్ట్రమని ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కోరారు. అయితే ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదని గతంలో ప్రకటించిన ప్రభుత్వం.. ఈ బడ్జెట్ లో సంపూర్ణ న్యాయం చేసేలా కేటాయింపులు జరిపిందని అంటున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల్లో రాజధాని అమరావతి నిర్మాణం ఒకటి. గత బడ్జెట్ లో అమరావతి కోసం రూ.15 వేల కోట్లు అప్పు ఇప్పిస్తామని చెప్పిన కేంద్రం.. ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా ఎలాంటి నిధులు ఇవ్వలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అదేవిధంగా పోలవరం నిర్మాణానికి గతంలో కేటాయించిన నిధులనే ఈ బడ్జెట్ లోనూ కేటాయించారు తప్ప ప్రత్యేకంగా ఎలాంటి సాయం చేయలేదంటున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి ఎలాంటి ప్రయోజనం కల్పించలేదు. దేశవ్యాప్తంగా అమలయ్యే పథకాలే రెండు రాష్ట్రాలకు వర్తిస్తాయి. మొత్తానికి తెలుగువారి కోడలు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి.

Tags:    

Similar News