జ‌గ‌న్‌ కు..సోనియాకు తేడా ఎక్క‌డ వ‌చ్చింది?

Update: 2017-12-07 05:30 GMT
కొన్ని ఆస‌క్తిక‌ర అంశాలు వెంట‌నే బ‌య‌ట‌కు రావు. కొన్నిసార్లు ఆల‌స్య‌మ‌వుతాయి. కానీ.. ఓ పెద్ద సంఘ‌ట‌న గురించి వాళ్లు వీళ్లు మాట్లాడ‌టం మామూలే. కానీ.. ఆ విష‌యానికి సంబంధించిన వారు నేరుగా మాట్లాడితే విష‌యం మీద క్లారిటీ రావ‌టంతో పాటు.. మ‌రిన్ని విష‌యాలు అవ‌గ‌త‌మ‌వుతాయి. ఎవ‌రి దాకానో ఎందుకు ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంగ‌తే చూస్తే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి.. జ‌గ‌న్‌కు ఎక్క‌డ తేడా వ‌చ్చింది? అన్న ప్ర‌శ్న‌కు ఓదార్పు యాత్ర అని చెబుతారు.

ఓదార్పు యాత్ర విష‌యంలో సోనియా తెగే వ‌ర‌కు ఎందుకు లాగారు? జ‌గ‌న్ ఎందుకంత ప‌ట్టుద‌ల‌తో వ్య‌వ‌హ‌రించారు? ఓదార్పు యాత్ర విష‌యంలో సోనియా ద‌గ్గ‌ర ఏం జ‌రిగింద‌న్న విష‌యంపై జ‌గ‌న్ ఏమ‌న్నారు?  లాంటి ప్ర‌శ్న‌ల‌కు తాజాగా స‌మాధానం దొరికింది. ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా జ‌గ‌న్ నాడు జరిగిన విష‌యాల్ని చెప్పుకొచ్చారు. సోనియాతో ఎక్క‌డ తేడా వ‌చ్చింద‌న్న విష‌యంపై ఆయ‌న జ‌రిగింది జ‌రిగిన‌ట్లుగా చెప్పుకొచ్చారు.

జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

"ఆమె (సోనియాగాంధీ) ఓదార్పుయాత్రకు పర్మిషన్‌ ఇచ్చి ఉంటే అసలు ఇంత దూరం వచ్చేదే కాదు. ఎందుకో నెగిటివ్‌ చెప్పేవాళ్లు ఎక్కువయినారో కాకపోతే ఆమెనే అట్లా మైండ్‌ సెట్‌ మారిందో మొత్తానికి ఓదార్పు యాత్రకు ఉన్న సెంటిమెంటును, దానితో నాకున్న ఎమోషనల్‌ కనెక్టును ఆమె అర్థం చేసుకోలేకపోయింది. నేను, అమ్మ, పాప.. ముగ్గురం ఫైనల్‌గా రిక్వెస్టు చేసి కన్విన్స్‌ చేసి ఒప్పించడానికి పోయినం. ఆమె (సోనియాగాంధీ) ఎంతసేపు చెప్పినా వినలేదు.. అందరినీ ఒకేచోట ఓదార్చండి అన్నారు. అది సాధ్యం కాద‌నిపించింది. చ‌నిపోయిన వారి కుటుంబాల్ని ఒక చోట‌కు పిలిచి ప‌రామ‌ర్శించ‌టం ఏమిటి?"

"నిజం చెప్పాలంటే అసలు ఆరోజు ఆవిడ  (సోనియా) ఒప్పుకొని ఉంటే ఈ సమస్య ఇంత దూరం వచ్చేదే కాదు. అమ్మ నేను, పాప ముగ్గురం పోయి మేము అడిగిందేమిటి? ఓదార్పుకు పర్మిషన్‌ ఇవ్వండని. అసలు ఓదార్పుకు పర్మిషన్‌ తీసుకోవడమంటేనే ఒక ఆశ్చర్యం. నాన్న మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడానికి ఇంకొకరి పర్మిషన్‌ కావాలనడమే బిగ్గెస్ట్‌ ఆశ్చర్యం"

"నాకైతే కాంగ్రెస్‌ కల్చరే తెలియదు. ఎందుకంటే అప్పటికి నేను ఎంపీ అయి వందరోజులైంది. అంతలోపలే నాన్న చనిపోయారు. మామూలుగా ఎవరైనా చనిపోతే పరామర్శకు పోతాం మనం. దానికి పర్మిషన్‌ తీసుకొని పోవాలన్న సంగతి నాకు అసలు తెలియదు. నాన్న చనిపోయిన ప్రదేశంలో మాట చెప్పాము. ఆ మాట నిలబెట్టుకోలేకపోతే ఎలా అని మనసును కదలిస్తా ఉంది. ఆవిడకేమో అర్థం కాదు. ఆవిడ ఎంతసేపు ఉన్నా వేరే యాంగిల్‌లో చూసేదేమో నాకు తెలీదు కానీ అందరినీ ఒకే చోటుకు పిలిచి మాట్లాడదామన్నారు. ఇచ్చిన మాట నిల‌బెట్టుకోక‌పోతే బాగోద‌ని బ‌య‌ట‌కు వ‌చ్చేశాం" అని వెల్ల‌డించారు.
Tags:    

Similar News