పాదయాత్ర సెంటిమెంటు వర్కవుట్ అవుతుందా?

Update: 2017-11-07 01:30 GMT
వింటే భారతం వినాలి.. తింటే గారెలే తినాలి.. అన్నట్లుగా చేస్తే పాదయాత్రే చేయాలి అంటారు తెలుగు రాజకీయ నాయకులు. కష్టపడితే పడ్డాం కానీ ఆ తరువాత అయిదేళ్లు సుఖపడొచ్చన్నది వారి ఆలోచన కావొచ్చు. రాష్ఱ్టమంతా పాదయాత్ర చేస్తే అధికారం అందుకోవచ్చన్న అభిప్రాయం తెలుగు నేతల్లో ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రతో ఈ ట్రెండు మొదలైంది. పాపం... ఎన్ని ప్రయత్నాలు చేసినా సీఎం కాలేకపోయిన రాజశేఖరరెడ్డి పాదయాత్ర వల్ల సీఎం అయ్యారు. ఆ తరువాత చంద్రబాబుదీ అదే పరిస్థితి. రెండు టెర్ములు అధికారం కోల్పోయి నానా బాధలు పడిన చంద్రబాబు అతి కష్టం మీద పాదయాత్ర పూర్తి చేసి సీఎం అయ్యారు.
    
వారిద్దరి అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠమో ఏమో కానీ, వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ కూడా ఇప్పుడు పాదయాత్ర మొదలు పెట్టారు. ఏకంగా ఆర్నెళ్ల పాటు ఆయన పాదయాత్ర సాగనుంది. సుమారు 3 వేల కిలోమీటర్లు నడవడానికి ఆయన సిద్ధమయ్యారు. మరి ఆయన కష్టం ఎంత వరకవు ఫలిస్తుందో చూడాలి.
    
నిజానికి వైఎస్ పాదయాత్ర సమయానికి.. చంద్రబాబు పాదయాత్ర సమయానికి.. ప్రస్తుత జగన్ పాదయాత్ర కాలానికి చాలా తేడా ఉంది. వైఎస్ పాదయాత్ర సమయంలో చంద్రబాబు పాలనపై రాష్ఱ్ట ప్రజలు విసిగిపోయారు. పైగా కరవు కాటకాలు తెగ వేధించాయి. అన్నీ కలిసి ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడింది. అదే సమయంలో వైఎస్ నేనున్నానంటూ ప్రజల వద్దకు వెళ్లడం వారికి ఆశ కలిగించింది. అదే ఓట్ల రూపంలో ప్రతిలపలించి రాజశేఖరరెడ్డిని సీఎం చేయడమే కాకుండా తిరుగులేని నేతగా నిలబెట్టింది.
    
ఇక చంద్రబాబు పాదయాత్ర వద్దకు వస్తే.. ఆ సమయానికి రాష్ర్టాన్ని ముక్కలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ గొడ్డలి పట్టుకుని తిరుగుతోంది. రాష్ర్ట కాంగ్రెస్ ను నడిపించే దిక్కు లేదు. రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. కాంగ్రెస్ పేరు చెప్తే చాలు జనం తిట్లు లంకించుకుంటున్న కాలం. మరోవైపు జనబలం ఉన్నప్పటికీ దాన్ని ఎలా ఓట్లుగా మలచుకోవాలో జగన్ అప్పటికి ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు. ఆ సమయంలో చంద్రబాబు పాదయాత్ర చేసి జనం కళ్ల ముందుకు, ఇళ్ల ముందుకు వెళ్లి ఫలితం సాధించారు.
    
ప్రస్తుతం జగన్ పాదయాత్ర చేస్తున్న ఈ సమయంలో చంద్రబాబు ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇంకా అది పక్వ దశకు రాలేదనే చెప్పాలి. పైగా... జగన్ - చంద్రబాబులే కాకుండా పవన్ రూపంలో మరో జనాదరణ గల రాజకీయ శక్తి కూడా ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇలాంటి తరుణంలో వైఎస్ - చంద్రబాబులకు ఫలితమిచ్చిన పాదయాత్ర జగన్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది కాలమే చెప్పాలి.
Tags:    

Similar News