అచ్చెన్న హవా కు బ్రేకులేస్తున్న మహిళా నేత

Update: 2023-06-28 21:07 GMT
ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడు అంటేనే శ్రీకాకుళం జిల్లా లో బిగ్ ఫిగర్. ఆయన కుటుంబం గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయం ఎదురులేకుండా చేస్తూ వస్తోంది. ఇక టెక్కలిలో చూసుకుంటే అచ్చెన్నాయుడు వరసగా గెలవడం మొదలెట్టి రెండు సార్లు అయింది. 2014, 2019లో ఆయన విజయ ఢంకా మోగించారు. ఇక 2024లో ఆయన గెలుపు సునాయాసమే అనుకుంటున్న వేళ వైసీపీ కొత్త వ్యూహం పన్నింది.

ఇప్పటిదాకా టెక్కలి నుంచి అచ్చెన్న మీద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ని పోటీకి అనుకున్నారు. అయితే ఇటీవల ఆయన సతీమణి టెక్కలి జెడ్పీటీసీ గా ఉన్న దువ్వాడ వాణిని  అచ్చెన్న మీద పోటీకి ఎంపిక చేశారు.  ఆమెను టెక్కలి వైసీపీ ఇంచార్జిగా నియమించారు.   దువ్వాడ శ్రీనివాస్ సతీమణీ వాణి. ఆమెకు రాజకీయ నేపధ్యం ఉంది. ఆమె గతం లో ఒకసారి అచ్చెన్న మీద పోటీ చేసిన అనుభవం కూడా ఉంది.

ఈ క్రమంలో దువ్వాడ వాణిని ముందు పెట్టి అటు బలమైన కాళింగ సామాజిక వర్గం దన్నుతో పాటు మహిళా కార్డు కూడా వాడాల ని వైసీపీ పక్కాగా డిసైడ్ అయింది. దువ్వాడ వాణి లేడీ కాబట్టి ఆమెకు ఉండే ప్లస్ పాయింట్స్ ని కూడా వాడుకుంటే వైసీపీ విజయం తధ్యమని తలపోస్తోంది.

మరో వైపు చూస్తే దువ్వాడ వాణి టెక్కలి నియోజకవర్గంలో దూకుడు గా ముందుకు సాగుతున్నారు. ఆమె టెక్కలి నుంచి జెడ్పీటీసీ గా ఉండడంతో పాటు గతం లో ఉన్న పరిచయాల ను ఉపయోగించుకుని టెక్కలి మొత్తం గట్టిగానే తిరుగుతున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగా ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న అచ్చెన్నాయుడు టెక్కలికి ఏమి చేశారంటూ ఆమె జనం లోకి వెళ్తున్నారు.

సహజంగానే రెండు సార్లు గెలిచిన అచ్చెన్నకు కొంత యాంటీ ఇంకెంబెన్సీ ఉంది. దాంతో ఆయన ను ఈసారి గట్టిగా కష్టపడితే ఓడించగలమని వైసీపీ భావిస్తోంది. ఇక టెక్కలి లో కాళింగుల కు మంచి బలం ఉంది. గతంలో వారే ఎపుడూ గెలుస్తూ వస్తున్నారు.

అయితే రెండు సార్లు వెలమ సామాజికవర్గం ఈ సీటు ని గెలవడంతో కాళింగులు ప్రతిష్టగా తీసుకున్నారు. సరైన అభ్యర్ధి కనుక రంగం లో ఉంటే ఓడించేందు కు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇపుడు దువ్వాడ వాణి పట్ల సానుకూల స్పందన లభిస్తోంది. అచ్చెన్న సైతం వైసీపీ ప్రత్యర్ధి మీద ఆరోపించినా విమర్శలు చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఆమె మహిళ కాబట్టి అచ్చెన్న దూకుడు కూడా తగ్గించుకోవాలి.

సరిగ్గా ఈ పాయింట్ తోనే నొక్కాల ని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే అచ్చెన్న ను మాజీ ని చేయాలన్న వైసీపీ మూడవ ప్రయత్నం అయినా ముచ్చటగా విజయవంతం అవుతుందా లేక అచ్చెన్న ఘన విజయం సాధించి హ్యాట్రిక్ వీరుడు అవుతారా అన్నది చూడాల్సి ఉంది.

Similar News