దక్షిణ కొరియా తరహాలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు?

Update: 2020-04-25 16:00 GMT
కరోనాపైపోరులో భాగంగా దేశవ్యాప్తంగా 19 రోజుల లాక్ డౌన్ 2.0 అమలులో ఉన్న సంగతి తెలిసిందే. మే 3తో లాక్ డౌన్ గడువు ముగియనుండడంతో లాక్ డౌన్ ఎత్తివేతపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఏపీని మండలాల వారీగా గ్రీన్, రెడ్ , ఆరెంజ్ జోన్లు ఏర్పాటు చేసుకున్న జగన్ సర్కార్....కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటూనే పాలనపై ఫోకస్ చేసింది. ఓ వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే...మరోవైపు ఏపీలో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జగన్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత గ్రీన్ జోన్లలో ఎన్నికలు నిర్వహించేందుకు జగన్ మొగ్గుచూపుతారన్న చర్చ జరుగుతోంది. ఆ దిశగానే జగన్ అడుగులు వేస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీ ఎస్ఈసీ పదవీకాలంపై ఆర్డినెన్స్ తేవడం...మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనగరాజ్ ను ఎస్ ఈసీగా నియమించడం వంటి పరిణామాలు ఆ అంచనాలకు బలం చేకూరుస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కనగరాజ్...అధికారులను ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకోసం ఎస్ఈసీ కనగరాజ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఎన్నికల నిర్వహించాలని భావిస్తున్నారట. అయితే, దక్షిణ కొరియా మాదిరి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఎన్నికలు నిర్వహించేందుకు జగన్ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరిన్ని పోలింగ్ కేంద్రాలను పెంచడం, ఓటర్లకు టైమ్ స్లాట్ ఇవ్వడం వంటి కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకొని ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ కనగరాజ్ భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావం తగ్గాక సోషల్ డిస్టెన్స్, టైమ్ స్లాట్ విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జగన్ సర్కార్ అనుకుంటోందట. అయితే, ఇంకా పూర్తిగా కరోనా అదుపులోకి రాకుండానే ఎన్నికలు నిర్వహించేంత ధైర్యం జగన్ చేయకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. మరోవైపు, తన తొలగింపుపై రమేష్ హైకోర్టును ఆశ్రయించడం....ఆ పిటిషన్ విచారణ ఏప్రిల్ 28వ తేదీకి వాయిదాపడడం వంటి పరిణామాలు ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారాయని చెబుతున్నారు. ఈ ప్రచారం వాస్తవమా కాదా అన్నది తేలాలంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదు.
Tags:    

Similar News