కమ్మల కోటలో జగన్‌ బీసీ ప్రయోగం!

Update: 2023-07-03 10:44 GMT
విజయవాడ లోక్‌ సభా నియోజకవర్గంలో ఈసారి వైసీపీ తరఫున బీసీ అభ్యర్థిని బరిలో దింపే ఆలోచనలో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఉన్నట్టు టాక్‌ నడుస్తోంది. ఇప్పటివరకు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల తరఫున ఎంపీలుగా గెలిచినవారిలో కమ్మలే అత్యధికం. 2004, 2009ల్లో కాంగ్రెస్‌ ఎంపీగా గెలిచిన లగడపాటి రాజగోపాల్, 2014, 2019ల్లో టీడీపీ ఎంపీగా గెలిచిన కేశినేని నాని ఇద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారే.

అంతకుముందు ఎంపీలుగా గెలిచిన పర్వతనేని ఉపేంద్ర, వడ్డే శోభనాద్రీశ్వరరావు, చెన్నుపాటి విద్య, గద్దె రామ్మోహన్‌ తదితరులు కూడా కమ్మలే. వీరిపైన ఓడిపోయిన అభ్యర్థులు కూడా కమ్మ సామాజికవర్గానికి చెందినవారే.

2014, 2019ల్లో వైసీపీ కూడా విజయవాడ ఎంపీ స్థానంలో కమ్మ అభ్యర్థులనే బరిలోకి దించింది. అయినా ఫలితం దక్కలేదు. 2014లో ప్రముఖ వ్యాపారవేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్, 2019లో ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ ను బరిలోకి దించినా వైసీపీ విజయం సాధించలేకపోయింది.

ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని విజయవాడ ఎంపీ స్థానానికి బరిలో దింపాలని జగన్‌ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి విజయవాడ లోక్‌ సభా నియోజకవర్గం పరిధిలో వివిధ నియోజకవర్గాల్లో కాపులు, ఎస్సీలు భారీ ఎత్తున ఉన్నారు. ఈ క్రమంలో ఈసారి బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని.. ఇలా చేస్తే ఎస్సీ, ఎస్టీలు, బీసీలు తమకే ఓట్లేస్తారని జగన్‌ లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు టీడీపీ తరఫున కేశినాని నాని సోదరుడు కేశినేని చిన్ని పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఆయన కాకపోతే లగడపాటి రాజగోపాల్‌ పోటీ చేయొచ్చని చెబుతున్నారు. దీంతో టీడీపీ తరఫున పోటీ చేసేది కమ్మ సామాజికవర్గం నుంచే అనేది ఖాయమైంది.

ఈ నేపథ్యంలో తమకు కొరకరాని కొయ్యగా మారిన విజయవాడ ఎంపీ స్థానాన్ని ఈసారి ఎలాగైనా గెలుచుకోవాలని జగన్‌ భావిస్తున్నారు. ఇందులో భాగంగా బీసీ అభ్యర్థిని బరిలో దించితే ఎలా ఉంటుందని ఆయన సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. అయితే ఇంకా అభ్యర్థి పేరు బయటకు రాకున్నా బీసీ అభ్యర్థిని బరిలోకి దించడం అనేది ఖాయమేనంటున్నారు.

Similar News