జగన్ సంచలనం..తొలి ఎమ్మెల్సీ పదవి మైనారిటీలకే

Update: 2019-06-03 14:58 GMT
వైసీపీ అధినేత - ఏపీకి నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన నయా ట్రెండ్ ను సృష్టిస్తున్నారనే చెప్పాలి. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూనే ముందుకు సాగుతున్న జగన్... రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరఫున ఇచ్చిన ఇఫ్తార్ విందులో మైనారిటీలకు తీపి కబురు చెప్పారు. గుంటూరులో జరిగిన ఇఫ్తార్ విందు సందర్భంగా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తొట్ట తొలి ఎమ్మెల్సీ సీటును జగన్ మైనారిటీలకే కేటాయిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణపై పోటీ చేసి ఓడిన ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లుగా జగన్ ప్రకటించారు.

ఈ సందర్భంగా జగన్ చేసిన ప్రసంగం మైనారిటీలను వైసీపీకి మరింత దగ్గర చేసిందన్న వాదన వినిపిస్తోంది. అయినా ఈ ఇఫ్తార్ విందులో జగన్ ఏం మాట్లాడారన్న విషయానికి వస్తే.. తాజా ఎన్నికల్లో తమ పార్టీ మైనారిటీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన చెప్పారు. మొత్తం 175 సీట్లలో ఐదు సీట్లను మైనారిటీలకు కేటాయించామని చెప్పారు. ఆ ఐదు స్థానాల్లో నాలుగు చోట్ల పార్టీ విజయం సాధించగా... ఓడిన ఒకే ఒక్క చోటు అయిన హిందూపురం నుంచి ఓటమి పాలైన ముస్లిం మైనారిటీ నేత ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లుగా జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా నాలుగు చోట్ల గెలియిన మైనారిటి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను ఆయన పరిచయం చేశారు. ఓడిన ఇక్బాల్ ను కూడా పరిచయం చేసిన జగన్... ఏ ఒక్కరూ ఊహించని విధంగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లుగా ప్రకటించి సంచలనం రేపారు. ఈ చర్యతో వైసీపీకి ముస్లిం మైనారిటీలత్లో మరింత మద్దతు దక్కినట్లుగా చెప్పక తప్పదు.

ఇక ఇదే సందర్భంగా తన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అవలంబించిన పార్టీ ఫిరాయింపులను కూడా ప్రస్తావించిన జగన్... దానిపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 23 మందిని, ఎంపీల్లో ముగ్గురిని చంద్రబాబు లాగేస్తే... సరిగ్గా అన్నే స్థానాలు మాత్రమే ఇప్పుడు టీడీపీకి మిగిలాయని జగన్ వేసిన సెటైర్ అదిరిపోయిందనే చెప్పాలి. అంతేకాకుండా ఆ ఫలితాలు కూడా ముస్లిం మైనారిటీలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైన రోజే అంటే గత నెల 23ననే ఫలితాలు వచ్చాయంటూ తనదైన పోలికను చెప్పారు.



Tags:    

Similar News