జ‌గన్ 'ప్లాన్ బీ' మొద‌లైంది

Update: 2016-12-30 09:26 GMT
ఏపీ ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి త‌న పార్టీ బలోపేతానికి మ‌రింత వేగంగా క‌స‌రత్తు చేస్తున్నారా? ఈ క్ర‌మంలో స‌మ‌స్య‌లు - అవ‌కాశాలు - సాధ్యాసాధ్యాలు స‌మీక్షించుకుంటూ 'ప్లాన్ బీ'తో ముందుకు సాగుతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. వరసగా సాగిన వలసలతో కొంత ఇరకాట పరిస్థితిని ఎదుర్కొన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం తిరిగి పుంజుకొని ఆత్మ స్థైర్యంతో ముందుకెళ్తోందన్న భావనను ఆ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. గ‌తంలో వ‌ల‌స‌ల స‌మ‌స్య‌ను ఎదుర్కొన్న‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ఇప్పుడు వలసలు ఉండకపోవచ్చన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తిరిగి పార్టీని ప్రజల్లో తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేపట్టింది. ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌నే...గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ శ్రేణులను నిరంతరం ప్రజల్లో భాగస్వామ్యం చేసేలా పార్టీ కార్యక్రమాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం రూపొందిస్తుండ‌టం అని చెప్తున్నారు.

గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని కొద్దికాలం క్రితం ఆ పార్టీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే కాకుండా స్థానికంగా ఉండే పార్టీ నేతలు కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు వీలు కలిగింది. పార్టీలో మొన్నటి వరకు సీనియర్లను గుర్తించడం లేదని ఉన్న అపవాదును అదిగమిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం దిద్దుబాట చర్యలు తీసుకొంది. రాష్ట్రంలో నెలకొన్న రైతాంగ సమస్యలపైనా ఎక్కడికక్కడా జిల్లాల వారీగా ఉద్యమాలను ఆ పార్టీ చేపడుతోంది. ఈ నెల నాలుగో తేదీన అనంతపురంలో జగన్‌ రైతాంగ సమస్యలపై ధర్నా చేపట్టారు. అలాగే ఏపీలో సెంటిమెంటుగా బలపడుతున్న ప్రత్యేకహోదా కోసం అన్ని విధాలుగా పోరాటం చేసేందుకు ఆ పార్టీ ప్రణాళికలను రూపొందించి ముందుకు సాగుతోంది. ఇప్పటికే యువతను ఆకర్షించేందుకు వీలుగా యువభేరీలతో జగన్‌ తన పోరాట దూకుడును పెంచుతున్నారు. తద్వారా యువతను మెజార్టీగా పార్టీవైపు ఆకర్షించేందుకు పావులు కదుపుతున్నారు. అదే సందర్భంలో ప్రాంతాల వారీగా పరిశ్రమలు - ఇతర సమస్యలపైనా ప్రత్యేక దృష్టిని సారిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలను ఉధృతంచేస్తోంది. విశాఖలోరైల్వే జోన్‌ కు సంబంధించి ఇప్పటికే ఉద్యమం చేపట్టిన ఆ పార్టీ నాయకత్వం మున్ముందు ప్రాంతాల వారీగా కీలక సమస్యలపై దృష్టిసారించి వాటిపై ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని సమాలోచనలు చేస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపైనా గతంలో ఉద్యమాలు చేసిన ఆ పార్టీ నాయకత్వం మున్ముందు కూడా ఈ వర్గాల సమస్య లపై ప్రత్యేక దృష్టిసారించి ఉద్యమాలను చేపట్టాలని యోచిస్తోంది.

గతంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏ ఉద్యమం చేపట్టినా జగన్‌ కేంద్రంగా కొనసాగేది. దీనివల్ల పార్టీకి ఇమేజ్‌ వచ్చినా పార్టీలోని నేతల బలోపేతానికి అది ఏమాత్రం ఉపయోగపడటంలేదన్న భావన ఆ పార్టీలోనే వ్యక్తమయ్యేది. పార్టీలోని సీనియర్లతోపాటు స్థానికంగా ఉన్న నేతలకు పోరాటాలలో ప్రాధాన్యత ఇస్తే వారికి జనం మద్దతు పెరిగి పరోక్షంగా పార్టీ పూర్తిస్థాయిలో బలపడుతుందన్న వాదన ఉండేది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం తన వైఖరిని కొంత మార్చుకొంది. పార్టీ లోని సీనియర్లను సైతం ఉద్యమంలోకి దించుతోంది. సదావర్తి సత్రం భూముల వ్యవహారంపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలోని పార్టీ కమిటీ కథన రంగంలోకి దిగి జనం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. మరో సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విశాఖ రైల్వేజోన్‌ ఉద్యమంలో పాలుపంచు కోవడమే కాకుండా ఇటీవల కురిసిన భారి వర్షాలకు పంటనష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. మరోవైపు కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి పార్టీ తరపున భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి - అంబటి రాంబాబు - బొత్స సత్యనారాయణ మద్దతు తెలుపుతూ ఆ వర్గం మద్దతును పార్టీకి కూడగడుతున్నారు. ఇలా ద్విముఖ వ్యూహంతో ఆత్మ స్థైర్యాన్ని పెంచుకుంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ముందుకు వెళుతోందన్న సంతృప్తిని ఆ పార్టీ వర్గాలు వ్యక్తంచేస్తున్నాయి. పార్టీ ప‌టిష్టత కోసం జ‌గ‌న్ చేప‌ట్టిన ప్లాన్ బీ ఫలించేలా ఉంద‌ని చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News