లోకేశ్‌ కు నంద్యాల గుర్తుకు రాలేదెందుకు?

Update: 2017-08-13 08:19 GMT
రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోన్న నంద్యాల ఉప ఎన్నిక‌కు సంబంధించి ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గం మొత్తం విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 9 నుంచి నంద్యాల అసెంబ్లీ నియోక‌వ‌ర్గంలో జ‌గ‌న్ ప‌ర్య‌టిస్తున్నారు.

నియోజ‌క‌వ‌ర్గం మొత్తం ప‌ర్య‌టిస్తూ.. బాబు పాల‌న గురించి వివ‌రంగా చెబుతున్నారు. గ‌డిచిన మూడున్న‌రేళ్ల కాలంలో రాష్ట్రానికి చంద్ర‌బాఉ చేసిందేమీ లేదంటున్న జ‌గ‌న్‌.. నంద్యాల మీద ఇప్పుడు కురిపిస్తున్న ప్రేమ అంతా ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలోనే త‌ప్పించి.. విడిగా అలాంటిదేమీ లేద‌న్న విష‌యాన్ని ఆయ‌న వివ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. నంద్యాల‌ను అది చేస్తాం.. ఇది చేస్తామంటూ ఇప్పుడు లేనిపోని హామీలు ఇస్తున్న వైనంలోని డొల్ల‌త‌నాన్నిజ‌గ‌న్ విప్పి చూపిస్తున్నారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌.. బాబు తాను అధికారంలోకి వ‌స్తే చేస్తాన‌ని చెప్పిన హామీల్లో ఎన్నింటిని గ‌డిచిన మూడున్న‌రేళ్లుగా బాబు నెర‌వేర్చార‌న్న సూటి ప్ర‌శ్న‌ను జ‌గ‌న్ సంధిస్తున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా.. మిగిలిన రాష్ట్ర మంత్రులంతా ఇప్పుడు నంద్యాల రోడ్ల మీద ప్ర‌జ‌ల్ని ఓట్లు అడిగేందుకు క్యూ క‌డుతున్న వైనాన్ని ఆయ‌న ఎత్తి చూపిస్తూ.. ఇదంతా ఎన్నిక‌ల కార‌ణంగా వ‌చ్చిన ప్రేమే త‌ప్పించి.. ప్ర‌జ‌ల మీద స్వాభావికంగా ఉన్న ప్రేమ ఎంత మాత్రం కాద‌న్న విష‌యాన్ని తేల్చి చెబుతున్నారు.

గ‌డిచిన కొద్దిరోజులుగా గ్రామీణ ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన జ‌గ‌న్‌.. ఈ రోజు (ఆదివారం) నంద్యాల ప‌ట్ట‌ణంలో ఉప ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తున్నారు. తాజా రోడ్ షోలో మాట్లాడిన జ‌గ‌న్‌.. ఏపీ అధికార‌ప‌క్ష నేత‌లపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఉప ఎన్నిక‌లు రాక ముందు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కానీ.. ఆయ‌న కుమారుడు కానీ ఒక్క‌సారైనా నంద్యాల వ‌చ్చారా? అని సూటిగా ప్ర‌శ్నించారు.

ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయి కాబ‌ట్టే వారికి నంద్యాల గుర్తుకు వ‌చ్చింద‌ని.. ఏపీ సీఎం చంద్ర‌బాబు క్యాబినెట్ మొత్తం నంద్యాల రోడ్ల మీద ఉంద‌న్నారు. ఉప ఎన్నిక‌ల పుణ్య‌మా అని చంద్ర‌బాబుకు.. ఆయ‌న త‌న‌యుడు నారాలోకేశ్ కు నంద్యాల ప‌ట్ట‌ణం గుర్తుకు వ‌చ్చింద‌న్నారు. అందుకే వారిప్పుడు క‌నిపిస్తున్నార‌ని చెబుతూ బాబు త‌న పాల‌న‌లో చోటు చేసుకున్న అవినీతి.. అన్యాయాల‌ను తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.

ప‌వ‌ర్ కోసం చంద్రబాబు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా హామీలు ఇస్తున్న‌ట్లుగా ఫైర్ అయిన జ‌గ‌న్‌.. బాబు ఇష్టం వ‌చ్చిన హామీలు ఇచ్చార‌న్నారు. రుణ‌మాఫీ పేరుతో రైతుల్ని.. డ్వాక్రా మ‌హిళ‌ల్ని మోసం చేశార‌ని ఆరోపించారు. గ‌డిచిన మూడున్న‌రేళ్ల‌లో బాబు ఒక్క హామీ కూడా నెర‌వేర్చ‌లేద‌న్నారు. రైతులు.. డ్వాక్రా మ‌హిళ‌లు.. విద్యార్థులు..నిరుద్యోగులు ఇలా అంద‌రిని బాబు మోసం చేశార‌న్నారు. ప్ర‌తి ఇంటికి చంద్ర‌బాబు రూ.76వేలు బాకీ ప‌డ్డార‌ని.. చివ‌ర‌కు పేద‌వారిని కూడా బాబు వ‌దిలిపెట్ట‌లేద‌న్నారు.

అధికారం కోసం ప్ర‌జ‌ల్ని వాడుకున్న చంద్ర‌బాబు.. ఏ ఒక్క సామాజిక వ‌ర్గానికి కూడా న్యాయం చేయ‌లేద‌న్నారు.  బాబు తీరుతో ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఊగిపోతున్నార‌న్నారు. క‌ర్నూలుజిల్లాకు ఎన్నో చేస్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు.. తాను చేసిన హామీల్లో ఏ ఒక్క‌టి అమ‌లు చేయ‌లేద‌ని గుర్తు చేశారు. జ‌గ‌న్ రోడ్ షోకూ పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు.
Tags:    

Similar News