ఆంధ్రప్రదేశ్ లో ఇక జగనన్న స్పోర్ట్స్ క్లబ్బులు

Update: 2022-06-10 08:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరుతో జగనన్న అమ్మ ఒడి, జగనన్న కాలనీలు, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి.. ఇలా ఎన్నో పథకాలు ఉన్నాయి. తాజాగా మరో కొత్త పథకానికి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఇక జగనన్న స్పోర్ట్స క్లబ్బులు రాబోతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయి నుంచి క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించడంతో పాటు వారిని వెలుగులోకి తీసుకురావడానికి ‘జగనన్న స్పోర్ట్స్‌ క్లబ్‌’ల పేరిట క్రీడాభివృద్ధికి శ్రీకారం చుట్టింది.

క్రీడలపై అవగాహన పెంపొందించేలా సచివాలయ ఉద్యోగుల్లో ఒకరికి ప్రత్యేక జాబ్‌ చార్ట్‌ను కేటాయిస్తూ ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు కూడా జారీ చేసేసింది. ప్రతి నెలా క్రమం తప్పకుండా, ముఖ్యమైన తేదీల్లో గ్రామాల్లోనే పోటీలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. స్థానిక పాఠశాలలు, కళాశాలల్లోని పీడీ, పీఈటీలకు కోఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పగించింది.

మొత్తం ఒక్కో గ్రామంలో 25 క్రీడాంశాలకు పైబడి క్లబ్బులను ఏర్పాటు చేసేందుకు జగన్ ప్రభుత్వం వీలు కల్పిస్తోంది. ఒక్కో క్రీడకు ఒక్కో క్లబ్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి స్పోర్ట్స్‌ క్లబ్బుకు అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి, పాలకమండలి సభ్యులు ఉంటారు. మూడునెలలకు ఒకసారి మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిల్లో స్పోర్ట్స్‌ క్లబ్బుల తరఫున పోటీలు నిర్వహిస్తారు. ఇందుకోసం శాప్‌ అధికారులు ప్రత్యేక యాప్ ను కూడా తెచ్చే యోచనలో ఉన్నారు. యాప్ ద్వారా స్పోర్ట్స్‌ క్లబ్బుల రిజిస్ట్రేషన్‌ను చేయనున్నారు.

కేవలం గ్రామాలే కాకుండా అక్కడ ఉండే ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో కూడా స్పోర్ట్స్‌ క్లబ్బులు ఏర్పాటు చేస్తారు. ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో నిధులు సమకూర్చుకుంటూ ఈ క్లబ్బులు తమ కార్యకలాపాలు కొనసాగిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. సర్పంచ్‌ చైర్మన్‌గా ఉండే గ్రామ స్పోర్ట్స్ క్లబ్బులో పంచాయతీ సెక్రటరీ, గ్రామానికి చెందిన జిల్లాస్థాయి క్రీడాకారుడు లేదా క్రీడాభివృద్ధికి ముందుకు వచ్చే దాత, స్థానిక హైస్కూల్‌ పీఈటీ సభ్యులుగా ఉంటారు.

ఇక మండల స్పోర్ట్ క్లబ్సులో మండల పరిషత్ అధ్యక్షుడు చైర్మన్ గా ఉంటారు. మండల స్పోర్ట్స్ క్లబ్బులో తహసీల్దార్, మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో), ఎస్‌ఐ, మండల ఇంజనీరు, మండల డెవలప్మెంట్ ఆఫీసర్ (ఎంపీడీవో), ఫిజికల్‌ డైరెక్టర్, ప్రిన్సిపల్‌/హెచ్‌ఎం, మండలం నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించిన పురుష, మహిళా క్రీడాకారులు (ఒక్కొక్కరు), స్వచ్ఛంద సేవకులు సభ్యులుగా ఉంటారు. వీరు ఆయా గ్రామాలు, మండలాల్లో అవసరమైన క్రీడా వసతులు గుర్తించడంతోపాటు మరుగున పడిన స్థానిక యుద్ధ కళలను కూడా గుర్తిస్తారు.
Tags:    

Similar News