మ‌హానాడును దెబ్బ‌కొట్టాల‌నేదే జ‌గ‌న్ వ్యూహం.. : చంద్ర‌బాబు ఫైర్‌

Update: 2023-05-01 10:20 GMT
టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించాల‌ని భావిస్తున్న మ‌హానాడును దెబ్బ‌కొట్టాల‌నేదే సీఎం జ‌గ‌న్ ఆయ‌న ప‌రివారం కుట్ర అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. ఈ కుట్ర‌లో భాగంగానే రాజ‌మండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భ‌వానీ భ‌ర్త వాసును, ఆదిరెడ్డి అప్పారావును అరెస్టు చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు.  రాష్ట్రంలో ఎవరూ వ్యాపారం చేయకూడదు అన్నట్టు సీఎం జగన్‌ వ్యవహారం ఉందని  విమర్శించారు.

జగత్‌ జనని చిట్స్‌ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు,  ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త.. ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌(వాసు)ను ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.

ఎమ్మెల్యే భవానీతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ప్రత్యర్థులను ఓడించడానికి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది. రోజురోజుకీ వైసీపీ వేధింపులు పెరిగిపోతున్నాయి'' అని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

కేసులు పెట్టి లొంగదీసుకోవాలనే ఆలోచనలు మానుకోవాలని వైసీపీ ప్ర‌భుత్వానికి సూచించారు. "సీఐడీ దర్యాప్తు సంస్థా.. లేక వైసీపీ వేధింపుల ఏజెన్సీనా? కోర్టులతో చీవాట్లు తిన్నా ప్రభుత్వ బుద్ధి మారలేదు. రాష్ట్రంలో ఎవరూ వ్యాపారం చేయకూడదా?" అని చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం జగన్‌రెడ్డి ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసినా భయపడేది లేద‌న్నారు. వైసీపీ కేడీలకు, సీఐడీ అధికారులకు తేడా లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ భౌతిక దాడులకు పాల్పడుతుంటే.. సీఐడీ అధికారులు సోదాల పేరుతో టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్‌ల అక్రమ అరెస్టు దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిరెడ్డి కుటుంబం నీతి నిజాయితీ ఏంటో జగన్‌రెడ్డి రాజమహేంద్రవరం ప్రజల్ని అడిగితే చెబుతారన్నారు.

మహానాడు రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నందునే స్థానిక నేతల్ని భయపెట్టాలన్న కుట్రలో భాగంగానే అరెస్టు చేశారని ఆరోపించారు. సీఐడీతో ప్రతిపక్షాలను బెదిరించాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. సీఎం జగన్‌ అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్ష నేతల అరెస్టులతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని దుయ్యబట్టారు.

Similar News