జగన్ వెనకడుగు కాదు..వ్యూహాత్మకమా?

Update: 2021-11-25 02:30 GMT
ఏపీలో మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కారు వెనక్కి తీసుకున్నట్లుగా హైకోర్టుకు చెప్పటం.. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీలో ఇదే విషయాన్ని వెల్లడించటం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. అర్థమై కానట్లుగా మాట్లాడారే కానీ.. రాజధానుల విషయంలో తానేం చేయనున్న విషయానికి సంబంధించి ఎలాంటి ప్రకటనను చేయలేదు.

ఒకటే రాజధానా? మూడు రాజధానులు ఉంటాయా? అన్నదాని మీదా స్పష్టత ఇవ్వలేదు. కాకుంటే.. ఈసారి సభలో పెట్టే బిల్లు పక్కాగా.. మరింత పకడ్భందీగా ఉంటుందని మాత్రం చెప్పటాన్ని మర్చిపోకూడదు.

ఇంతకీ మూడు రాజధానుల మీద జగన్ ఏం చేయనున్నారు? అన్న ప్రశ్నలకు బోలెడన్ని సమాధానాలు వస్తున్నాయి. అయితే.. తాజాగా వైసీపీ నేతల నోటి నుంచి ఆసక్తికరమైన మాట ఒకటి వినిపిస్తోంది.

సింహం రెండు అడుగులు వెనక్కి వేయటం అంటే ఏమిటి? మరింత వేగంగా ముందుకు దూకటానికే కదా? అదే రీతిలో తమ అధినాయకుడు మూడు రాజధానులపై మరింత వేగంగా దుమకటానికి వీలుగా ప్లాన్ చేసుకున్నారని చెబుతున్నారు. అదెలా కుదురుతుందన్న ప్రశ్నకు వారు తమదైన శైలిలో సమాధానం చెబుతున్నారు.

మూడు రాజధానుల తీర్మానంపై జగన్ వెనకడుగు వేశారని అందరూ భావిస్తున్నారని.. అదంతా వారి భ్రమ మాత్రమేనని.. వాస్తవం వేరేలా ఉందని చెబుతున్నారు. ఏదైనా బిల్లు చట్టంగా మారాలంటే ఉభయ సభలు (రాష్ట్రంలో అసెంబ్లీ.. మండలి ఉంటే) ఆమోదం తెలపాలి.

జగన్ సర్కారు పెట్టిన బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినా.. మండలిలో ఆమోదముద్ర పడలేదు. దీనికి కారణం.. అప్పట్లో శాసన మండలిలో వైసీపీకి బలం లేకపోవటం. నాటి విపక్షమైన టీడీపీకి సంఖ్యా పరంగా బలం ఉంది. ఈ కారణంతోనే వైసీపీ ప్రభుత్వం ఆమోదించిన బిల్లుకు మండలిలో మాత్రం ఆమోద ముద్ర పడలేదు.

ఇదే సమయంలో కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో.. హైకోర్టు విచారణ జరుపుతోంది. ఇప్పటివరకు జరిగిన విచారణను చూస్తే.. మూడు రాజధానుల విషయంలో ఏపీ సర్కారుకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఆ ముప్పును గ్రహించిన సీఎం.. బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారే కానీ.. తాను చెప్పిన మూడు రాధానుల విషయంలో వెనక్కి తగ్గుతున్నట్లుగా మాట రాకపోవటాన్ని గుర్తు చేస్తున్నారు.

తాజాగా ఎదురైన అనుభవాల నేపథ్యంలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును మరింత వివరంగా..పక్కాగా.. వంక పెట్టేందుకు వీలు లేని రీతిలో సిద్ధం చేస్తున్నారు. ఈసారి అసెంబ్లీలోనే కాదు.. మండలిలోనూ ఏపీ అధికార పార్టీకి తిరుగులేని అధిక్యత ఉంది. ఈ కారణంగా రెండు సభల్లోనూ బిల్లుకు ఆమోదముద్ర పడుతుంది.

గవర్నర్ సైతం దీనికి సంతకం పెట్టక తప్పదు. సో.. మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును సరికొత్తగా తీసుకొచ్చి అందరిని సర్ ప్రైజ్ చేయటమే జగన్ వ్యూహంగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. రెండు అడుగులు వెనక్కి వేయటం సింహం మాదిరి మరింత స్పీడ్ గా లంఘించటానికే తప్పించి.. వెనక్కి తగ్గటానికి కాదన్న విషయం త్వరలోనే అందరికి అర్థమవుతుందన్న మాట వైసీపీ నేతల అంతర్గత సంభాషణల్లో వ్యక్తమవుతోంది.




Tags:    

Similar News