'కొత్త’ కసరత్తు కోసం కీలక నిర్ణయం తీసుకున్న జగన్

Update: 2020-08-07 16:22 GMT
ఓపక్క కరోనా వణికిస్తున్న వేళ.. రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. ఈ మహమ్మారి నుంచి ఏపీ ప్రజలకు అవసరమైన వైద్యసాయాన్ని అందిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. మరోవైపు పాలనా సంబంధమైన అంశాలపై చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దేశంలోని మిగిలిన ముఖ్యమంత్రులతో పోలిస్తే.. కరోనా మీద తనకున్న క్లారిటీని ‘సహజీవనం’ చేయాల్సిందేనన్న మాటతో చెప్పేసినప్పుడు చాలా మంది ఆయన్ను గేలి చేశారు. కామెడీ చేసిన వారు సైతం లేకపోలేరు.  

అయినప్పటికి జగన్ మాత్రం రియాక్టు కాలేదు. నవ్విన నాప చేను పండుతుందన్న సామెతకు తగ్గట్లే.. చాలామందికి తత్త్వం బోధ పడింది. మొదటి నుంచి కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ.. ఇంకోవైపు పాలనా రథం ఆగిపోకుండా సాగేలా ప్లాన్ చేస్తున్నారు. ఏపీలోని 13 జిల్లాలకు బదులుగా.. ప్రతి లోక్  సభా స్థానాన్ని జిల్లాగా మార్చాలన్న తన ప్రయత్నాలకు సంబంధించి తాజాగా ఆయన కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్ గా.. ఆరుగురు ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వుల్ని జారీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ఈ కమిటీ.. అధ్యయనం చేయనుంది. సీసీఎల్ఏ.. జీఏడీ సర్వీస్ సెక్రటరీతో పాటు ప్రణాళిక శాఖ కార్యదర్శి.. సీఎంవో అధికారి సభ్యులుగా ఉండనున్నారు. కమిటీ కన్వీనర్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవహరించనున్నారు. ఈ కమిటీకి మూడు నెలల గడువు ఇచ్చారు. ఈ లోపు అధ్యనం చేసి కొత్త జిల్లాలకు సంబంధించి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించిన తర్వాత ఏపీ సర్కారు తదుపరి నిర్ణయాన్ని తీసుకోనుంది.
Tags:    

Similar News