జగన్ పవన్ ఫోన్లో మాట్లాడుకున్నారా?

Update: 2023-06-15 01:02 GMT
పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి మధ్య ఏదో ఉందని అంతా అనుకుంటారు. ఈ ఇద్దరూ ఎపుడూ బహిరంగంగా కలిసినది లేదు అలాగే ఈ ఇద్దరూ ఎక్కడా ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియా  ద్వారా కూడా పరస్పరం పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పుకున్నదీ లేదు. ఒక విధంగా ప్రజాస్వామ్య యుగంలో రెండు పార్టీలకు చెందిన నాయకులు ఇంతలా బిర్రబిగుసుకుని ఏళ్ళకు ఏళ్ళు ఉండడం అంటే విచిత్రమే.

ఇక పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే అసెంబ్లీలో సీఎం జగన్ తో మాట్లాడి ఉండేవారు. జగన్ సీఎం అయ్యాక అఖిలపక్షం లాంటివి ఏర్పాటు చేసి ఉన్నా ఒక రాజకీయ పక్షన్ నేతగా పవన్ వచ్చి కలిసేవారు కానీ అవేమీ జరగలేదు. దాంతో పవన్ జగన్ ఎపుడూ ఎక్కడా  కనీసం తారసపడలేదా మాట్లాడుకోలేదా అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.

అసలు ఈ ఇద్దరి మధ్యన ఎందుకు ఇలా జరుగుతోంది. వీరి మధ్య ఎందుకు గ్యాప్ ఉంది. అసలు ఏమి జరిగింది అన్నది అందరిలో కలిగే ఒక పెద్ద డౌట్. అయితే ఒకే ఒక్కసారి జగన్ తో పవన్ మాట్లాడారట . అది కూడా నాలుగేళ్ల క్రితం. ఫోన్ లో. చాలా లేట్ గా అయినా లేటెస్ట్ గా ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కత్తిపూడి వారాహి రధయాత్ర లో రివీల్ చేశారు.

జగన్ 151 సీట్లతో గెలిచి సీఎం గా ప్రమాణం చేస్తున్న కార్యక్రమానికి జగన్ విపక్ష నేతలను అందరినీ ఆహ్వానించారు. జగన్ పవన్ కి కూడా ఫోన్ చేసి మాట్లాడారుట. ఆ సందర్భంగా ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నట్లుగా పవన్ సభలో చెప్పారు.

మీరు 151 సీట్లతో గెలిచి సీఎం అయినందుకు మనస్పూర్తిగా అభిననందనలు, బాగా పాలించండి, మా మద్దతు ఉంటుంది. ఇక విపక్షంగా మేము విమర్శలు చేసేవి అన్నీ నిర్మాణాత్మకంగా ఉంటాయి. నేను ఎపుడు వ్యక్తిగత అంశాల జోలికి పోను. మీరు కూడా తప్పులు ఏవీ మీ వైపు లేకుండా చూసుకోండి అని సీఎం కి చెప్పాను అని అన్నారు.

కానీ జగన్ పాలన వచ్చాక తనను పూర్తిగా విమర్శిస్తున్నారని, వ్యక్తిగత అంశాల జోలికి వస్తున్నారని, ఆఖరుకు నాలుగేళ్ళ తన కుమారుడిని సైతం వదలడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు అంటే విధానపరంగా ఉండాలి కానీ వ్యక్తిగతం కాదు అదే తన అభిప్రాయం అన్నారు తాను ప్రజా సమస్యల మీద పోరాడుతూంటే వైసీపీ నేతలు తన పర్సనల్ విషయాలు ఎత్తి చూపుతున్నారని ఆయన మండి పడ్డారు.

నాకు తెలియని చరిత్రలు ఉన్నాయా. అందరి భాగోతాలు నాకు తెలుసు. కానీ నేను వాటిని టచ్ చేయను నాకు సంస్కారం అడ్డొస్తుంది అని పవన్ పేర్కొన్నారు. మొత్తానికి చూస్తే జగన్ పవన్ ఫోన్లో ఒకసారి మాట్లాడుకున్నారని పవన్ మాటల బట్టే తెలుస్తోంది. ఒక విధంగా చూస్తే ఇది చాలా ఇంటరెస్టింగ్ మ్యాటరే. ఇప్పటిదాకా ఎవరూ చెప్పనిది. ఎక్కడా తెలియనిది ఈ విషయం.

Similar News