దేవుడి పేరుతో బాబు బ్యాచ్ కు చుక్కులు

Update: 2016-07-04 04:49 GMT
విపరీతమైన ఆకలిగా ఉన్న వ్యక్తికి పంచభక్ష్య పరమాన్నాలు దొరికితే ఎలా ఉంటుంది? దాదాపుగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కోకు తాజా పరిణామాలు ఇదే తీరులో ఉన్నాయి. వరుస ఎదురుదెబ్బలతో కిందామీదా పడుతున్న జగన్ బ్యాచ్ కు.. ఏపీ అధికారపక్షం చేసిన తప్పులు ఇప్పుడు రెట్టింపు ఉత్సాహాన్ని ఇవ్వటమే కాదు.. బాబు బ్యాచ్ కు చుక్కలు చూపిస్తున్నారు. ఇలాంటి టైం కోసమే ఎదురుచూస్తున్న జగన్ మానసపుత్రిక ‘సాక్షి’ సైతం చెలరేగిపోతోంది.

ఆచితూచి వ్యవహరిస్తూ విపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తానికి పెద్ద తప్పే చేశారు.దిద్దుకున్నా చెరిగిపోని మచ్చను మూటగట్టుకున్నారు. దశాబ్దాల తరబడి వివరణ ఇచ్చుకున్నా.. సంతృప్తి చెందని వైనానికి తెర తీశారు. ఏపీ రాజధాని విజయవాడలో అభివృద్ధి పేరుతో.. రోడ్ల విస్తరణ పేరుతో పెద్ద ఎత్తున ఆలయాల్ని పడగొట్టటం వివాదంగా మారటమే కాదు.. ఏపీ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తే అవకాశాన్ని కల్పించారు.

ఎలాంటి వ్యూహం లేకుండా రాత్రికి రాత్రి పదుల సంఖ్యలో దేవాలయాల్ని కూల్చేయటం ఇప్పుడు బెజవాడవాసుల్నితీవ్ర ఆగ్రహానికి గురయ్యేలా చేసింది.దీనిపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను గుర్తించిన ఏపీ మంత్రుల కమిటీ..ఆదివారం సాయంత్రం స్పష్టమైన ప్రకటనను చేయటంతో పాటు.. ఇకపై ఒక్క గుడిని టచ్ చేయమంటూ లెంపలేసుకున్నంత పని చేశారు.

ఇంతలా ఆత్మరక్షణలో పడిన వైరి వర్గానికి దిమ్మ తిరిగిపోయేలా షాకులిచ్చేందుకు జగన్ నేతలు రంగంలోకి దిగారు. వారికి జగన్ మానసపుత్రిక సాక్షి మీడియా దన్ను లభించటంతో చెలరేగిపోతున్నారు. హిందూ దేవాలయాల్ని పడగొడుతూ.. బాబు సర్కారు మహాపచారానికి ఒడిగడుతుందన్న విమర్శ చేస్తూ.. దేవుళ్లపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడుతోంది. దేవాలయాల కూల్చివేత వార్తల్నిపెద్ద ఎత్తున ఇవ్వటంతో పాటు..విజయవాడ ఎమ్మెల్సీ విషయంలో అధికారులు అనుసరించిన పక్షపాతాన్ని ఫోటోల సాక్షిగా తేల్చిన జగన్ మీడియా దెబ్బకు ఏపీ అధికారపక్షానికి చుక్కలు కనిపించే పరిస్థితి.

దేవాలయాల కూల్చివేత ఇష్యూలో ఏపీ అధికారపక్షానికి మరిన్ని ఇబ్బందులు కలిగించేలా తన నెట్ వర్క్ మొత్తాన్ని జగన్ మీడియా ఈ ఇష్యూ మీద ప్రత్యేక ఫోకస్ చేసినట్లుగా తాజాగా వస్తున్న వార్తల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి. జగన్ మీడియాలో వచ్చినవార్తల్ని తప్పు పట్టే కన్నా.. తమ తొందరపాటుతో ప్రత్యర్థికి లేనిపోని అవకాశం ఇచ్చినట్లుగా చెప్పక తప్పదు.అంది వచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించటానికి సిద్ధమైన జగన్ బ్యాచ్ దెబ్బకు తెలుగు తమ్ముళ్లు కిందామీదా పడిపోతున్నారు. దేవుడి గుళ్లను కూల్చే విషయంలో ఎలాంటి మొహమాటాల్లేకుండా వ్యవహరించారో.. సరిగ్గా అదే రీతిలో తెలుగు తమ్ముళ్లపైనా.. ఏపీ సర్కారుపైనా విమర్శలు గుప్పిస్తూ..ఎంత బద్నాం చేయాలో అంత బద్నాం చేయటంలో జగన్ బ్యాచ్ సక్సెస్ అవుతుందని చెప్పాలి. తాజా పరిణామాలే అందుకు నిదర్శనమని చెప్పక తప్పదు.

తాజాగా సాక్షిలో అచ్చేసిన ఒక వార్తే దీనికి నిదర్శనంగా చెప్పాలి.విజయవాడలో కూల్చేసిన గుళ్ల అంశంపై స్వామి పరానంద భారతి పేరిట ఇచ్చిన అభిప్రాయాన్ని చూస్తే.. ఏపీ సర్కారు ఎంత దారుణమైన పాపానికి ఒడిగట్టిందో అన్న భావన కలగటం ఖాయం. ‘‘కృష్ణా  నది ఒడ్డున ఆలయాలు కూల్చటం దేవుడిని హత్య చేసినట్లు అవుతుంది. ఏన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయాల్ని తొలగించటం ఆగమశాస్త్రాన్ని వ్యతిరేకించటమే. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను కలిగించాల్సిన ప్రభుత్వమే ఈ దుష్టచర్యకు పాల్పడటాన్నిపీఠాధిపతులు.. భక్తులు ఖండించాలి. ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలతో ప్రజలకు అరిష్టం కలుగుతుంది’’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈ తరహా ఎదురుదాడిని ఎంతటి అధికారపక్షానికైనా ఎంత ఇబ్బంది..?
Tags:    

Similar News