సోమ‌వారం కేబినెట్‌..మండ‌లి చాప్ట‌ర్ క్లోజ్‌

Update: 2020-01-24 12:33 GMT
`తలకిందులుగా తపస్సు చేసినా మండలి రద్దు కాదు...!`టీడీపీ సీనియర్ నేత - మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట ఇది. ఆయ‌న ఈ మాట అన‌డం వెనుక కార‌ణం ఏంటో తెలిసిన సంగ‌తే. ఏపీ రాజ‌ధాని వికేంద్రీకరణ - సీఆర్డీఏ రద్దు బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొంద‌గా... ఆ బిల్లుకు శాసనమండలిలో బ్రేక్ పడింది. దీంతో అసలు మండలినే రద్దు చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వైసీపీ సర్కార్ చేస్తోంది. శాసనమండలిని రద్దు చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. మ‌రోవైపు, సోమవారం 27 ఉదయం సచివాలయంలో కేబినెట్ సమావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో మండ‌లిని ర‌ద్దు చేసే నిర్ణ‌యం తీసుకుంటార‌ని అంటున్నారు.

రాజకీయ అజెండాతో నడుపుతున్న శాసనమండలిని కొనసాగించాలా.. వద్దా అనే దానిపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుందామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కోరిన సంగతి తెల‌సిందే. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిపాదనకు అంగీకరించిన స్పీకర్‌ సోమవారం ఆ అంశాన్ని శాసనసభలో చర్చించేందుకు అనుమతించారు. ఇదే స‌మ‌యంలో కేబినెట్ స‌హ‌చ‌రుల‌తో చ‌ర్చించి సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని స‌మాచారం.

ఇందులో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సోమవారం ఉదయం 9.30 గంటలకు కేబినెట్‌ భేటీ జరగనుంది. సాంకేతిక‌ - న్యాయ‌ప‌ర‌మైన - రాజ‌కీయ అంశాల‌ను కూలంక‌షంగా చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తోంది. కాగా, మండ‌లి విష‌యంలో స‌ర్కారు అడుగుల‌పై టీడీపీ భ‌గ్గుమంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు త‌న 40 ఏళ్ల రాజకీయం అనుభ‌వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూపారని పేర్కొన్న ఆ పార్టీ నేత‌ దేవినేని ఉమ.. వైసీపీ సర్కార్ శాసన మండలిని రద్దు చేస్తే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. సీఎం జ‌గ‌న్ తలకిందులుగా తపస్సు చేసినా శాసన మండలిని రద్దు చేయలేరని అన్నారు.


Tags:    

Similar News