అమ‌రావ‌తికి జ‌గ‌న్‌!..టీడీపీకి ఇబ్బంది త‌ప్పదా?

Update: 2018-04-17 12:15 GMT
రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాదును వినియోగించుకునే వీలున్నా... ఓటుకు నోటు కేసు దెబ్బ‌కు టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఉన్న‌ప‌ళంగా హైద‌రాబాదును వీడి విజ‌య‌వాడ‌కు ప‌రుగులు పెట్టార‌న్న ఆరోప‌ణ‌లు వినిపించాయి. క‌నీసం కార్యాల‌యాల‌కు కూడా వ‌స‌తి లేని విజ‌యవాడ‌కు ఆమాత్రం ప‌రుగులు పెట్టారంటే... బాబు ప్ర‌మాదాన్ని గుర్తించే ఆ ప‌ని చేశార‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి. అయితే క‌నీస ఏర్పాట్లు కూడా లేకుండా అమ‌రావ‌తికి వ‌చ్చేందుకు అంత‌గా ఆస‌క్తి చూప‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాస్త ఇబ్బంది అనిపించినా... హైద‌రాబాదు నుంచే ఇప్ప‌టిదాకా పార్టీ వ్య‌వ‌హారాల‌ను న‌డిపారు. అయితే ఇటీవ‌లే గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి స‌మీపంలోని తాడేప‌ల్లి వ‌ద్ద కొంత స్థ‌లాన్ని కొనుగోలు చేసిన జ‌గ‌న్‌... అందులో పార్టీ కార్యాల‌యంతో పాటుగా త‌న ఇంటిని కూడా నిర్మించుకునే ప‌నిని మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌నులు ఇప్పుడు చాలా వేగంగా సాగుతున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం సాగుతున్న ప‌నుల వేగాన్ని ప‌రిశీలిస్తే...  అక్టోబ‌ర్ కంటే ముందుగానే కార్యాల‌యం, ఇల్లు సిద్ధ‌మైపోతాయ‌ని తెలుస్తోంది. పార్టీ కార్యాల‌యంతో పాటు ఇల్లు కూడా సిద్ధ‌మైపోయిన వెంట‌నే పార్టీ వ్య‌వ‌హారాల‌ను ఇక్క‌డి నుంచే ప‌ర్య‌వేక్షించాలని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్లుగా పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా త‌న కుటుంబాన్ని కూడా ఆయ‌న ఇక్క‌డికే మార్చేసుకుంటార‌ని కూడా చెబుతున్నారు. ఇదే జ‌రిగితే... ఏపీ రాజ‌కీయాల‌పై జ‌గ‌న్ మ‌రింత లోతుగా దృష్టి సారించే అవ‌కాశాలున్న‌ట్టేన‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మొత్తంగా అక్టోబ‌ర్ నాటికి జ‌గ‌న్ హైద‌రాబాదు నుంచి అమరావ‌తికి షిప్ట్ అయిపోతార‌న్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఇదే జ‌రిగితే... ఓటుకు నోటు కేసు త‌ర్వాత ఆద‌రాబాద‌ర‌గా అమ‌రావ‌తి వ‌చ్చేసిన చంద్ర‌బాబుకు ఇబ్బందులు త‌ప్పేలా లేవ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే... ఏపీ పాల‌న‌ను హైద‌రాబాదు నుంచి అమ‌రావ‌తికి మార్చిన త‌ర్వాత హైద‌రాబాదులోని త‌న పాత ఇంటిని కూల‌గొట్టేసిన చంద్ర‌బాబు... సరికొత్త హంగుల‌తో భారీ ఖర్చుతో అత్యాధునిక వ‌స‌తుల‌తో త‌న ఇంటిని పున‌ర్మించుకున్నారు.

పాల‌న‌ను అమ‌రావ‌తికి షిప్ట్ చేయాల‌ని భావించిన చంద్ర‌బాబు హైద‌రాబాదులో త‌న ఇంటిని ఎందుకంత ఖ‌ర్చు పెట్టి నిర్మించుకుంటున్నార‌న్న గుస‌గుస‌లు నాడు బాగానే వినిపించాయి. రాజ‌కీయంగానే ఏపీని చూస్తున్న చంద్ర‌బాబు.. నివాసానికి మాత్రం హైద‌రాబాదునే ప్రిఫ‌ర్ చేస్తున్నార‌ని త‌న ఇంటి పున‌ర్నిర్మాణంతోనే ఒప్పేసుకున్న‌ట్లుగా తేలిపోయింది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ అమ‌రావ‌తికి ప‌ది కిలో మీటర్ల దూరంలో నిర్మించుకుంటున్న త‌న ఇంటికి షిప్ట్ అయిపోతే... బాబుపై ఈ దిశ‌గా మ‌రింత మేర విమ‌ర్శ‌లు పెరిగే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇదిలా ఉంటే... ఇప్ప‌టిదాకా వైసీపీ శ్రేణులు పార్టీ కార్య‌క్ర‌మాల కోసం హైద‌రాబాదు వెళ్లేవారు. కొన్ని ప్రాంతాల నేత‌ల‌కు ఇది పెద్ద‌గా ఇబ్బంది కాకున్నా... అమ‌రావ‌తికి స‌మీపంలోని వారికి కొంత మేర ఇబ్బంది క‌లిగింద‌ని చెప్పొచ్చు. అయితే కొత్త రాజ‌ధాని న‌గ‌రం నిర్మాణానికి రూపు రేఖ‌లు రాకున్న‌ప్ప‌టికీ... జ‌గ‌న్ త‌న పార్టీ కార్యాల‌యాన్ని మాత్రం అమ‌రావ‌తికి స‌మీపంలో నిర్మించుకుంటున్న వైనంతో ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం క‌నిపిస్తోంది. అదే అక్టోబ‌ర్‌లో జ‌గ‌న్ గృహ ప్ర‌వేశంతో పాటు పార్టీ కార్యాల‌యాన్ని కూడా ప్రారంభిస్తే... పార్టీ శ్రేణుల్లో మ‌రితం ఉత్సాహం క‌నిపించ‌డం ఖాయ‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News