ఇద్దరు ఇద్దరే.. మోదీ-బైడెన్ కలయికపై సర్వత్రా ఆసక్తి..!

Update: 2022-11-11 06:38 GMT
అగ్రదేశం అమెరికా.. భారత్ మధ్య ఎన్నో ఏళ్లుగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక.. రక్షణ పరమైన అంశాలతోపాటు అనేక అంశాలు ఈ రెండు దేశాల మధ్య మిళితమై ఉన్నాయి. ప్రవాస భారతీయులు సైతం అమెరికాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారంతా కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా రాజకీయంగానూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.

అమెరికాలోని ముఖ్యమైన పదవుల్లో మన భారతీయులు ఉండటం గర్వకారణం. ప్రస్తుత అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమల హారిస్ కూడా ప్రవాస భారతీయురాలే కావడం విశేషం. ప్రవాస భారతీయులు అమెరికాలో స్థిరపడినప్పటికీ ఇండియాపై తమ మక్కువను ఎప్పుడూ ప్రదర్శిస్తూనే ఉన్నారు. అక్కడి నుంచే వారంతా తమ కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు.  

ఈ క్రమంలోనే ఇండియా పట్ల అమెరికా సానుకూల ధృక్పథంతో ముందుకు సాగుతోంది. దీంతో ఇరుదేశాల మధ్య మైత్రీ బంధం క్రమంగా బలపడుతోంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఇరుదేశాల మధ్య విభిన్న వాదనలు నెలకొంటున్నాయి. అయినప్పటికీ ఆ ప్రభావం ఇరు దేశాల సంబంధాలపై పెద్దగా ప్రభావం చూపించకపోవడం గమనార్హం.

భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలి నుంచి అమెరికా పట్ల సానుకూలత దృక్పథాన్నే ప్రదర్శిస్తున్నారు. రక్షణ కొనుగోళ్లు, ఆర్థికపరమైన అంశాల్లో అమెరికాకు ప్రాధాన్యమిస్తున్నారు. అక్కడి రాజకీయాల పట్ల కూడా మోదీ తనదైన శైలిలో ఆసక్తి చూపుతున్నారు. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో మోదీ సైతం ఇన్ డైరెక్టుగా ట్రంప్ కు మద్దతు తెలిపారు. అయితే ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యాడు.

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నిక కావడంతో ఈ ప్రభావం భారత్ పై ప్రభావం చూపుతుందని అంతా భావించారు. అయితే వీటన్నింటికీ జో బైడెన్.. భారత ప్రధాని మోదీ చెక్ పెట్టారు. అమెరికా అధ్యక్ష స్థానంలో ఎవరున్నా ఇండియాతో మైత్రీ సంబంధం కొనసాగుతుందనే సంకేతాలను జో బైడెన్ పంపించారు. ఇక త్వరలోనే ఇండోనేషియాలోని బాలీలో జీ 20 సదస్సు జరుగనుంది.

ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. దీంతో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే విషయంలో జాతీయ భద్రతా సలహా దారుడు జేక్ సల్లీవన్  వైట్ హౌజ్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారత ప్రధాని మోదీలు ఇద్దరు ఇద్దరేనని ప్రశంసలు కురిపించారు. క్లిష్ట సమస్యలను ఎదుర్కోవడంలో వీరిద్దరి ఒకేలా ఆలోచిస్తారని.. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగేలా కష్టపడుతుంటారని జేక్ సల్లీవన్ వెల్లడించారు. దీంతో వీరిద్దరి మధ్య భేటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కాగా వచ్చే ఏడాది జీ 20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News