చంద్ర‌బాబు విదేశాల‌కు పారిపోతారా?

Update: 2020-02-18 07:15 GMT
ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు విదేశాల‌కు పారిపోయే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ కూడా అయిన రాజా ఈ విష‌యంలో ఐటీ శాఖ‌కు కొన్ని స‌ల‌హాలు కూడా ఇచ్చారు. అందులో ముఖ్య‌మైనది.. చంద్ర‌బాబు నాయుడి పాస్ పోర్టును స్వాధీనం చేసుకోవాల‌నేది! చంద్ర‌బాబు నాయుడి పాస్ పోర్టును స్వాధీనం చేసుకుని, ఆయ‌న విదేశాల‌కు పారిపోయే అవ‌కాశాల‌ను మూసేయాల‌ని రాజా కోరారు. ఇంత‌కీ ఉన్న‌ట్టుండి చంద్ర‌బాబు కు అలాంటి ప‌రిస్థితి ఎందుకు వ‌స్తోంది? అంటే.. చంద్ర‌బాబు మాజీ పీఎస్ ఇంటి పై ఐటీ రైడ్స్ విష‌యాన్ని ప్ర‌స్తావించారు రాజా.

ఇటీవ‌లే చంద్ర‌బాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంటి పై ఐటీ రైడ్స్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అందులో చంద్ర‌బాబు నాయుడి అక్ర‌మాస్తులు బ‌య‌ట‌పడ్డాయ‌ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నారు. శ్రీనివాస్ అక్ర‌మాస్తుల‌పై విచార‌ణ జ‌రిగితే చంద్ర‌బాబు నాయుడు అరెస్టు కాక త‌ప్ప‌ద‌ని అంటున్నారు. అందుకే చంద్ర‌బాబు నాయుడు విదేశాల‌కు పారిపోయే ప్ర‌మాదం ఉంద‌ని ఈ ఎమ్మెల్యే అనుమానం వ్య‌క్తం చేస్తూ ఉన్నాడు. అందుకే ముంద‌స్తుగా చంద్ర‌బాబు నాయుడి పాస్ పోర్టును స్వాధీనం చేసుకోవాల‌ని స‌ల‌హా ఇస్తున్నాడు.

దేశంలో ప‌లువురు ఆర్థిక నేర‌గాళ్లు ప‌రార్ అయిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్ మాల్యా, నీర‌వ్ మోదీ లాంటి వాళ్లు భారీ స్కామ్ ల‌కు పాల్ప‌డి దేశం విడిచి ప‌రార్ అయ్యారు. విదేశాల్లో త‌ల‌దాచుకుంటున్నారు. అయితే రాజ‌కీయ నేత‌లకు మాత్రం ఇలాంటి క‌థలు లేవు. కొంద‌రు ఆర్థిక నేరాల్లో శిక్ష నిరూపించ‌బ‌డి కూడా శిక్ష‌ను ఎదుర్కొంటూ జైల్లో ఉన్నారు. అంతే కానీ విదేశాల‌కు పారిపోయే ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. తాము బ‌య‌ట‌కు వ‌చ్చాకా మ‌ళ్లీ స‌త్తా చాట‌గ‌ల‌మ‌నే వారు జైళ్ల‌లో కూడా ఉంటారు. ఇలాంటి నేప‌థ్యం లో చంద్ర‌బాబు నాయుడు విదేశాల‌కు పారి పోతాడ‌ని అన‌డం కొంచెం టూమ‌చ్ గా ఉందేమో!
Tags:    

Similar News