తమిళనాడులో ‘జల్లికట్టుపై’ సెగలు

Update: 2017-01-13 05:21 GMT
సంక్రాంతిని పురస్కరించుకొని తమిళనాడులో నిర్వహించే జల్లికట్టుపై సుప్రీం చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సరికొత్త సెగలు రేగుతున్నాయి. జల్లికట్టును అనుమతించేది లేదంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పటంతో తమిళనాడులో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది కేంద్రం.. రాష్ట్రాల మధ్య పోరాటంగా మారనుండటం గమనార్హం. ఏది ఏమైనా.. ఎవరేం చెప్పినా.. జల్లికట్టును జరిపి తీరాల్సిందేనని తమిళనాడులోని పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు.. నిరసన దీక్షలు షురూ అయ్యాయి. ఇక.. చిత్రసీమ మొత్తం ఏకతాటిపైకి వచ్చి.. జల్లికట్టును సమర్థిస్తున్నారు.

తాము చేస్తున్న ఆందోళనలకు విపక్ష అధినేత స్టాలిన్ కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. తమిళ అగ్రహీరోలైన కమల్ హాసన్.. దర్శకులు భారతీరాజా.. రాజేందర్ తదితరులు జల్లికట్టును అడ్డుకుంటే ఆందోళనలు చేస్తామని ఇప్పటికే చెప్పారు. జల్లికట్టు వద్దంటే.. చికెన్ బిర్యానీ మీద కూడా బ్యాన్ పెట్టాలంటూ కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

తమిళనాట రాజకీయపార్టీలు.. ప్రముఖులు.. ప్రజలు అంతా ఒక్కటై జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని కోరినా సుప్రీంకోర్టు మాత్రం ససేమిరా అనటమే కాదు.. ఈ వ్యవహారంపై దాఖలైన పిటీషన్ పై వెంటనే తీర్పు చెప్పాలన్న విన్నపాన్ని తోసిపుచ్చింది. వెంటనే విషయాన్ని తేల్చమనటం కూడా సరికాదంటూ పిటీషన్ తరఫు న్యాయవాదులకు చెప్పింది. ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయంలో సుప్రీం తీసుకున్న నిర్ణయం తమిళనాడులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. సుప్రీం ఆదేశాలను పట్టించుకోకుండానే ఇప్పటికే పలుచోట్ల జల్లికట్టును నిర్వహిస్తుండటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News