హింసాత్మకంగా మారిన మెరీనా

Update: 2017-01-23 07:39 GMT
జల్లికట్టుపై విధించిన నిషేదాన్ని ఎత్తివేయాలని కోరుతూ ఐదు రోజుల క్రితం చెన్నై మెరీనా బీచ్ లో వినూత్న నిరసన చేప్టటటం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ నిరసన శాంతియుతంగా సాగటంతో పాటు.. దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకుంది. రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా సాగుతున్న ఈ నిరసన తీవ్రతతో యావత్ తమిళనాడు నిరసన బాట పట్టింది. ఈ నేపథ్యంలో జల్లికట్టుపై ఉన్న నిషేదాన్ని తొలగిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది.

అయితే.. జల్లికట్టుపై తాత్కాలిక పరిష్కారాలు వద్దని.. శాశ్విత పరిష్కారం కావాలంటూ మెరీనా బీచ్ వద్ద ఆందోళనకారులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే.. రిపబ్లిక్ డే దగ్గరకు రావటం.. దీనికి కోసం మెరీనా బీచ్ వద్ద ఏర్పాట్లు చేసేందుకు వీలుగా.. ఆందోళనకారుల్ని మెరీనా బీచ్ నుంచి బయటకు పంపేందుకు ఈ ఉదయంనుంచి తమిళనాడు పోలీసులు ప్రయత్నాలు షురూ చేశారు.

దీనిపై ఆందోళనకారులు తీవ్రంగా ప్రతిఘటించారు. తమ సమస్యకు శాశ్విత పరిష్కారం చూపిస్తే తాము వెళ్లిపోతామని వారు వాదించటం.. వారిని అక్కడి నుంచి పంపేయటానికి పోలీసులు బలప్రయోగానికి పాల్పడటంతో అప్పటివరకూ ఉన్న శాంతియుత వాతావరణం ఒక్కసారి మారిపోయింది. తీవ్ర ఉద్రిక్తతలు మొదలయ్యాయి.

నిరసనకారుల్ని ఎలాగైనా బయటకు పంపించాలన్నట్లుగా పోలీసులు వ్యవహరించటంతో వారం నుంచి శాంతియుతంగా సాగుతున్న నిరసనలు ఒక్కసారిగా హింస చోటు చేసుకుంది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించటం.. వారిని బలవంతంగా అదుపులోకి తీసుకొని వాహనాల్లోకి తరలిస్తున్ననేపథ్యంలో పోలీసులపై ఆందోళనకారులు తిరగబడుతున్నారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇదే సమయంలో బీచ్ కు సీపంలోని పోలీస్ స్టేషన్ పై గుర్తు తెలియని కొందరు పెట్రోల్ బాంబులు విసరటంతో పరిస్థితి మొత్తం మారిపోయింది.తమపై బలప్రయోగానికి పాల్పడుతున్న పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులు పోలీస్ స్టేషన్లోని వాహనాల్ని పెద్ద ఎత్తున తగలబెట్టటంతో పరిస్థితి ఇప్పుడు అనూహ్యంగా మారిపోయింది. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. శాంతియుత నిరసనతో అందరి దృష్టిని ఆకర్షించి మెరీనా బీచ్ లో ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకోవటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పక తప్పదు.

 
Tags:    

Similar News