జానా మాత్ర‌మే ఇలా చేయ‌గ‌ల‌రు

Update: 2016-09-03 17:17 GMT
ఏ ర‌క‌మైన స్పంద‌న తెలియ‌జేస్తున్నారో అర్థం కాని రీతిలో స్పందించే నాయ‌కుడిగా పేరున్న సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు - ప్ర‌స్తుత సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ఇటీవ‌ల రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశమైన నేత‌గా నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిప‌క్ష పార్టీ కాంగ్రెస్ నాయ‌కులు అంతా అధికార టీఆర్ ఎస్‌ ను విమ‌ర్శిస్తుంటే వారి నాయకుడిగా మ‌ద్ద‌తు ప‌ల‌కాల్సిన జానారెడ్డి మాత్రం ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను మెచ్చుకుంటుండ‌టం ఆన‌వాయితిగా మారింది. ఐదు రూపాయ‌ల భోజ‌నం అయినా - పొరుగు రాష్ట్ర మ‌హారాష్ట్ర తో తెలంగాణ ఒప్పందం అయినా జానారెడ్డి అధికార టీఆర్ ఎస్‌ కు మ‌ద్ద‌తుగా మాట్లాడారు. దీంతో ఆయ‌న‌పై ప‌లువురు విమ‌ర్శ‌లు చేయ‌గా ఇపుడు స‌ర్కారును నిల‌దీయాల‌నే ప్ర‌క‌ట‌న చేశారు.

జిల్లాల విభ‌జ‌న‌ - ఎన్నిక‌ల హామీల గురించి జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో జిల్లాల విభజన వసతులు, చారిత్రక నేపథ్యం దృష్టిలో ఉంచుకుని జరగాలని అభిప్రాయ‌ప‌డ్డారు. జిల్లాల విభజన పేరిట ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. టీఆర్ ఎస్ ఎన్నిక‌ల హామీలు సైతం నిల‌పుకోవ‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదన్నారు. రెండు పడకగదుల ఇళ్లు - ద‌ళితులు - మైనార్టీల‌కు రిజర్వేషన్లు అమలు వంటి హామీలు సైతం నెరవేలేదని జానారెడ్డి మండిప‌డ్డారు. ప్రజల ఆశలు - ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిపాలన సాగడంలేదని ఆరోపించారు. ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీసే ధోరణి యువతలో పెరగాలని జానా రెడ్డి సూచించారు.  ప్రజల తరఫున తాము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని ఆయన చెప్పారు. త‌మ పోరాట స్పూర్తితో ప్రభుత్వానికి ప్రజలే తగిన సమయంలో గుణపాఠం నేర్పించాలని జానారెడ్డి సూచించారు

 జానారెడ్డి ప్ర‌క‌టన నేప‌థ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఒకింత గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నాయి. ఇంత‌కీ త‌మ నాయ‌కుడు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక‌మా లేక అనుకూల‌మా అర్థం కావ‌డం లేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఇచ్చిన పిలుపుపై ఎంత‌కాలం క‌ట్టుబ‌డి ఉంటారో అని లోలోప‌ల చ‌ర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News