చంద్రుళ్లూ... జానా మాట విన‌బ‌డిందా?

Update: 2017-11-09 11:06 GMT
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత... అటు కొత్త రాష్ట్రం తెలంగాణ‌తో పాటు అటు పాత రాష్ట్రం ఏపీలోనూ నేత‌ల సంఖ్య ఇబ్బడిముబ్బ‌డిగా పెరిగిపోయింద‌నే చెప్పాలి. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత అనే కంటే కూడా విడిపోక‌ముందు కూడా నేత‌ల సంఖ్య క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తోంది. ఎందుకంటే కొత్త‌గా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న వారితో పాటు అప్ప‌టికే పాలిటిక్స్‌ లో ఉన్న ఫ్యామిలీల నుంచి వార‌సులు కూడా వ‌రుస‌గా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. దీంతో నేత‌ల సంఖ్య సాధార‌ణంగానే పెరుగుతూ వ‌స్తోంది. అయితే ఇలా పెరుగుతున్న నేత‌ల సంఖ్య‌కు అనుగుణంగా అసెంబ్లీ - పార్లమెంటు స్థానాల సంఖ్య మాత్రం పెర‌గ‌డం లేదు. 2009 ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లోనూ మొత్తంగా సీట్ల సంఖ్య పెర‌గ‌లేదు. కొన్ని జిల్లాల్లో ఆయా స్థానాల సంఖ్య పెరిగితే... మ‌రికొన్ని జిల్లాల్లో ఆ సంఖ్య త‌గ్గిపోయింది. మొత్తంగా టోట‌ల్ నెంబ‌ర్ మాత్రం మార‌లేదు.  

ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అటు తెలంగాణ‌లో టీఆర్ ఎస్‌ - ఇటు ఏపీలో టీడీపీ పార్టీ ఫిరాయింపుల‌కు గేట్లు బార్లా తెరిచేశాయి. భ‌విష్య‌త్తుల్లో త‌మ రాష్ట్రాల్లో విప‌క్షమ‌న్న‌ది ఉండ‌కూడ‌ద‌న్న ల‌క్ష్యంతో కేసీఆర్ ముందుకు సాగుతుంటే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో విప‌క్షాన్ని బ‌ల‌హీనం చేయ‌డం ద్వారా మ‌రోమారు అధికారం చేప‌ట్టాల‌ని చంద్ర‌బాబు ప‌క్కాగా వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఈ క్ర‌మంలో పార్టీలోకి కొత్త‌గా వ‌చ్చిన చేరుతున్న నేత‌ల‌కు - అప్ప‌టికే పార్టీలో ఉన్న నేత‌ల‌కు మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం... ఎలాగూ 2019లోగా అసెంబ్లీ, పార్ల‌మెంటు స్థానాలు పెరుగుతాయి క‌దా... పాత‌ - కొత్త‌ల‌కు అవ‌కాశాలు త‌ప్ప‌కుండా ల‌భిస్తాయ‌ని చెప్పుకుంటూ వ‌స్తున్నారు. ఈ మాట నిజ‌మేనేమోన‌న్న భావ‌న క‌లిగించేలా రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీల‌కు బాకాలు ఊదుతున్న ప‌త్రిక‌లు నియోజ‌కవ‌ర్గాల పెంపు అదిగో - ఇదిగో అంటూ క‌థ‌నాలు అచ్చేస్తున్నాయి. అయితే నియోజ‌క‌వ‌ర్గాల పెంపు 2019లోగా సాధ్యం కాద‌ని ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వం తేల్చేయ‌డంతో ఆ ప‌త్రిక‌ల వాయిస్‌ లో బేస్ లేద‌ని తేలిపోగా... పెరిగే స్థానాల మాట‌ను ప‌క్క‌న‌ప‌డేసిన ఇద్ద‌రు చంద్రుళ్లు దాదాపుగా ప్ర‌త్యామ్నాయాల‌ను కూడా రెడీ చేసుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే సీట్ల పెంపుపై ఆశ‌లు వ‌దిలేసుకుని ప్ర‌త్యామ్నాయాల వైపు దృష్టి సారించిన ఇద్ద‌రు చంద్రుళ్ల‌లో మరోమారు ఆశ‌లు చిగురించేలా చేశారు మ‌న *బాహుబ‌లి*. సినిమాల్లో బాహుబ‌లి ఎవ‌ర‌న్న విష‌యం మ‌న‌కు తెలుసు గానీ... మ‌రి పాలిటిక్స్‌లో బాహుబ‌లి ఎవ‌ర‌న్న విష‌యానికి వ‌స్తే... తెలుగు నాట ఈ మాట‌ను తొలుత వాడేసి... కాంగ్రెస్ పార్టీకి తానే బాహుబ‌లిని అంటూ ఘ‌నంగా ప్ర‌క‌టించుకున్న నేత కుందూరు జానారెడ్డి గుర్తున్నారు క‌దా. ఇప్పుడైతే ఏమోగానీ... మొన్న‌టిదాకా ఆ పార్టీకి ఆయ‌నే బాహుబ‌లి. అయినా ఇప్పుడు ఈ బాహుబ‌లి ఏమ‌న్నారు?... ఈయ‌న మాట‌ల‌తో చంద్రుళ్ల‌లో ఆశ‌లు ఎలా రేకెత్తాయ‌న్న విష‌యానికి వ‌స్తే... కాసేప‌టి క్రితం తెలంగాణ అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన జానారెడ్డి... తెలుగు రాష్ట్రాల్లో నియోజ‌క‌వ‌ర్గాల పెంపు గురించి ప్ర‌స్తావించారు. 2019 ఎన్నికల‌లోగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగే అవ‌కాశాలు లేవ‌ని ఆయ‌న చెప్పారు. ఈ విష‌యం ఇప్ప‌టికే అందిరికీ తెలిసిన విష‌య‌మే క‌దా... ఇందులో కొత్త ఏముందంటారా?  అస‌లు ఆ కొత్త క‌థ ఇక్క‌డే ఉంది మ‌రి.

ప్ర‌స్తుతానికి అయితే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పెరిగే ఛాన్సు లేద‌ని చెప్పిన జానారెడ్డి... కేంద్రం పెంచాల‌నుకుంటే మ‌రి ప‌రిస్థితి ఏమిటి? అన్న విష‌యాన్ని ఆస‌క్తిగా ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుతం 2019 ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం మాత్ర‌మే ఉంది. మ‌రి ఇప్ప‌టిదాకా సీట్ల సంఖ్య పెంపు దిశ‌గా అస‌లు క‌స‌ర‌త్తే మొద‌లు కాలేదు. మ‌రి ఇప్ప‌టికిప్పుడు ఆ క‌స‌ర‌త్తు మొద‌లైతే... ఎన్నిక‌ల నాటికి అది పూర్తి అవుతుందా? అంటే ఎందుకు కాదంటున్నారు జానారెడ్డి. సీట్ల సంఖ్య‌ను పెంచాల‌ని కేంద్రం త‌ల‌చుకుంటే... తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెర‌గ‌డం ఈజీయేన‌ని - 2019 ఎన్నిక‌ల్లోగానే ఈ క్ర‌తువు భేషుగ్గా పూర్తి అవుతుంద‌ని కూడా జానారెడ్డి చెప్పారు. అయితే సీట్ల సంఖ్య‌ను పెంచే విష‌యంలో కేంద్రం అంత‌గా సానుకూలంగా లేద‌ని, ఈ కార‌ణంగానే సీట్ల సంఖ్య పెరిగే అవ‌కాశాలు లేవ‌ని తాను భావిస్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు. అయితే గియితే... కేంద్రం సీట్ల సంఖ్య‌ను పెంచాల‌ని మాత్రం అనుకుంటే... ఆ ప‌ని క్ష‌ణాల్లో అయిపోతుంద‌ని కూడా జానా ఆస‌క్తికర కామెంట్ చేశారు. అంటే సీట్ల సంఖ్య పెంపు పెద్ద ఇబ్బందేమీ కాని విష‌య‌మేన‌న్న మాట‌. మ‌రి జానా మాట చెవిన‌ప‌డితే... ఇద్ద‌రు చంద్రుళ్లు ఎలా రియాక్ట్ అవుతారోన‌న్న విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.
Tags:    

Similar News