టీ అసెంబ్లీలో చంద్రుడు..వెన్నెల ముచ్చట్లు

Update: 2016-12-27 05:43 GMT
అసెంబ్లీ సమావేశాలు అన్న వెంటనే విమర్శలు.. ప్రతివిమర్శలు.. ఆరోపణలు.. వాకౌట్లు.. పోడియం దగ్గర ఆందోళనలు.. నేతల చిందులు.. ఆవేశకావేశాలు లాంటివే చూస్తుంటాం. నిర్మాణాత్మక చర్చలతో పాటు.. మాటలతో ఒకరిపై ఒకరు అధిక్యం సాధించేందుకు జరిగే ప్రయత్నాలు ఈ మధ్య కాలంలో బాగా తగ్గిపోతున్నాయి. అలాంటివేళ.. సోమవారం నాటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భిన్నమైన రీతిలో ఆసక్తికర చర్చ సాగింది. చంద్రుడు.. పున్నమి.. వెన్నెల.. వెలుగులు.. అంటూ భావుకత మాటల రూపంలో రాజకీయ నేతల మధ్య నడిచిన మాటల సంవాదం.. ఆసక్తికరంగా మారటమే కాదు.. అధికార విపక్షాల మధ్య మాటలు నడిచాయి.

టీఎస్ ఐపాస్ పై జరిగిన చర్చ సందర్భంగా ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డిల మధ్య సాగిన మాటల సంవాదం ఇరుపక్షాల మధ్య ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా సాగింది. ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాన్ని విపక్ష సభ్యులు చేసిన విమర్శలపై స్పందించిన మంత్రి కేటీఆర్.. పున్నమి చంద్రుడి.. వెన్నెలను చూసిన కొందరు ఆనందపడుతుంటారు. మరికొందరు చంద్రుడిలో మచ్చలు వెతుకుతుంటారు. మండలి విపక్ష సభ్యులు కూడా పారిశ్రామికవిధానాన్ని ప్రశంసించారు. కానీ.. అసెంబ్లీలో మాత్రం అలా కన్పించటం లేదంటూ మెత్తగా చురకలు అంటించారు.

దీనికి బదులిచ్చే క్రమంలో జానారెడ్డి.. ‘‘పున్నమి చంద్రుడు వెన్నెలనిస్తాడు. ఆ వెలుగు సహజం. సత్యం. మీరు చెబుతున్న వెన్నెలలో వెలుగు ఉందా? లేదా? అన్నదే మా సందేహం. నిజంగా వెలుగులిస్తే మంచిదే. అంతేతప్ప మేం మచ్చల్ని విమర్శించటం లేదు.  పారిశ్రామికవిధానం గురించి మంత్రి చెబుతుంటే అంతా అయిపోయిందని.. మేం మాట్లాడటానికి ఏమీ లేదన్నట్లు అనిపిస్తోంది. నిజంగా ఆయన చెప్పిన దాంట్లో 60 శాతం పూర్తి అయినా అభివృద్ధి దిశగా కదిలినట్లే. మన ఊరు.. మన ప్రణాళికలో ఇలానే చెప్పారు. దీన్ని మన ఊరు.. మన ప్రణాళిక అన్నట్లుగా మాత్రం చేయొద్దు’’ అని బదులిచ్చారు.

గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి.. చంద్రబాబులు ఇదే రీతిలో చెప్పేవారని.. ఇప్పుడు మీరు కూడా ఇలానే చెబుతన్నారని.. మీరు చెబుతున్నది కూడా అలాంటి లక్షల కోట్లేనా? అంటూ జానారెడ్డి వేసిన కౌంటర్ తో సభ్యులంతా నవ్వేశారు. జానారెడ్డి లాంటి నేత తన మీద వేసిన కౌంటర్ కు సమాధానం చెప్పేందుకు సిద్ధమైన మంత్రి కేటీఆర్..‘’60 శాతం కాదు. ఫస్ట్ క్లాస్ తెచ్చుకొని జానారెడ్డిగారి చేతే శభాష్ అనిపించుకుంటాం. మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు.. చంద్రుడు స్వయం ప్రకాశకుడు.. మేం వెలుగులు సాధిస్తాం’’ అని చెప్పారు. దీనికి టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తూ.. చంద్రుడుస్వయం ప్రకాశితుడు కాదంటూ స్పందించారు. దీనికి బదులిచ్చిన కేటీఆర్.. ‘‘మేం మాట్లాడుతోంది వెన్నుపోటు చంద్రుడి గురించి కాదు.. మా చంద్రుడి గురించి’’ అంటూ ముక్తాయించారు. ఎన్ని మాటలు చెప్పినా.. వాస్తవం ఏమిటంటే.. చంద్రుడు స్వయం ప్రకాశితం కాదన్నది వాస్తవం. ఆ నిజాన్ని తమ చంద్రుడికి అపాదించొద్దంటే.. ‘చంద్రుడి’ ప్రస్తావనే తీసుకురాకూడదు. కానీ.. ఇలాంటి లాజిక్కులు అధికారపక్షానికి.. అధికారపక్షాన్ని అభిమానించే వారికి అస్సలు నచ్చవు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News