టీడీపీ.. మజ్లిస్ లు ప్రాంతీయ పార్టీ.. జనసేన గుర్తింపు లేని పార్టీ!

Update: 2021-09-25 09:30 GMT
ఆసక్తికర వివరాల్ని వెల్లడించింది కేంద్ర ఎన్నికల సంఘం. తాజాగా నోటిఫికేషన్ రూపంలో జారీ చేసిన ఈ వివరాల్ని చూస్తే.. దేశంలో గుర్తింపులేని రాజకీయ పార్టీలు భారీగా ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. అంతేకాదు.. వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఆసక్తికర ఫలితాల్ని సొంతం చేసుకునే మజ్లిస్ పార్టీని ప్రాంతీయ పార్టీగానే గుర్తిస్తున్నట్లుగా ఈసీ వెల్లడించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే..తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా పేర్కొనే (ఏపీ కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో పోటీ చేస్తారనే కాన్సెప్టులో) ఆ పార్టీ.. ఇకపై ఆ మాటను చెప్పుకోలేదేమో?

ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ప్రాంతీయ పార్టీగా పేర్కొంటూ తాజా నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోఉన్న టీఆర్ఎస్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను ప్రాంతీయ పార్టీలుగా గుర్తించింది. ఇక.. పవన్ అధినేతగా వ్యవహరిస్తున్న జనసేన పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తింపు లభించకపోగా.. గుర్తింపు లేని రాజకీయ పార్టీ జాబితాలో ఉన్నట్లు పేర్కొంది.

దేశంలోని 27రాష్ట్రాల్లో మొత్తం 57 పార్టీలకు ప్రాంతీయ హోదాను కట్టబెట్టింది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు లేనివి 2796 పార్టీలుగా తేల్చారు. గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు అనువుగా ఉండేందుకు 197 గుర్తులను ఫ్రీ సింబల్స్ లిస్టులో ఉంచారు. అందులో జనసేన గుర్తు అయిన గాజు గ్లాసును కూడా చేర్చారు. ఇక.. జాతీయ పార్టీలుగా మమతకు చెందిన టీఎంసీ.. బీఎస్పీ.. బీజేపీ.. సీపీఐ.. సీపీఎం.. కాంగ్రెస్.. ఎన్సీపీ.. నేషనల్ పీపుల్స్ పార్టీలుగా వెల్లడించింది.

ఇదే తరహాలో నోటిఫికేషన్ ను 2019 మార్చి 15న విడుదల చేయగా.. తాజాగా మరోసారి విడుదల చేశారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. హైదరాబాద్ చిరునామాతో ఉన్న పార్టీలను ఏపీకి చెందిన పార్టీలుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మొత్తంగా దేశంలో జాతీయ పార్టీలు ఎనిమిది.. ప్రాంతీయ పార్టీలు 57గా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపును ఇచ్చింది.
Tags:    

Similar News