ఎన్నికల పొత్తులపై జనసేన ముఖ్య నేత నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!

Update: 2022-12-12 06:36 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని జనసేన పార్టీ భావిస్తోంది. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ లో అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ చెబుతున్నారు.

మరోవైపు జనసేన తమతో కలసి వస్తే బాగుంటుందని టీడీపీ ఆశిస్తోంది. తమ రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే వైసీపీని చిత్తుగా ఓడించొచ్చని టీడీపీ భావిస్తోంది. ఇంకోవైపు బీజేపీ తాము జనసేనతోనే కలసి పోటీ చేస్తామని అంటోంది. వైసీపీ, టీడీపీ కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు అని చెబుతోంది. ఈ నేపథ్యంలో జనసేన – బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

జనసేన – టీడీపీ కలసి పోటీ చేస్తే తమ పార్టీ ఓడిపోవడం ఖాయమని భావిస్తున్న వైసీపీ నేతలు జనసేనపై నిప్పులు చెరుగుతున్నారు. దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయాలని సవాల్‌ విసురుతున్నారు. 175 సీట్లలో పోటీ చేస్తే పవన్‌ ను తాము ప్యాకేజీ స్టార్‌ అనబోమని అంటున్నారు. పవన్‌ ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని వైసీపీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే పదే పదే పవన్‌ ను టార్గెట్‌ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న నాదెండ్ల పొత్తులపై త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపారు.

మార్చి 14న ఇప్పటం గ్రామంలో జరిగిన సభలో పవన్‌ కల్యాణ్‌ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం అంతా కలిసికట్టుగా ముందుకు రావాలని సూచించారని నాదెండ్ల మనోహర్‌ గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకోవాలని, అందుకు తమ సహకారమందిస్తామని తమ అధినేత చెప్పారని వెల్లడించారు. పవన్‌ మాట ప్రకారం.. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటామని తెలిపారు. ఆ తర్వాత ఎన్నికలకు ఎలా సిద్ధం కాబోతున్నామో అందరికీ పారదర్శకంగా తెలియజేస్తామని తెలిపారు.

యువతకు ఉద్యోగావకాశాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో మభ్యపెట్టిందనిన నాదెండ్ల మనోహర్‌ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ వ్యవహారాల కోసం కొత్తగా ఐదు లక్షల మంది గృహసారథులను నియమిస్తామంటున్నారని.. అది ప్రజాస్వామ్యబద్ధం కాదని తెలిపారు.

మరోవైపు తెలంగాణలో జరగబోయే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తును ఇప్పటికే ఆ పార్టీ ప్రారంభించింది. తెలంగాణలో 32 నియోజకవర్గాలకు కార్యనిర్వాహకుల నియామకాన్ని పూర్తి చేసింది. తెలంగాణలో పోటీకి సిద్ధంగా ఉండాలంటూ ఇటీవల పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో శ్రేణులను సిద్ధం చేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News