బీజేపీతో గ్యాప్...పవన్ కీలక వ్యాఖ్యలు

Update: 2021-01-23 14:30 GMT
ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన....ఆ పార్టీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతామని గతంలో ప్రకటించింది. అయితే, కొన్ని విషయాల్లో మినహాయిస్తే....బీజేపీ, జనసేనలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ పెద్దలు పవన్ కు తగినంత గౌరవమిస్తున్నప్పటికీ....ఏపీ, తెలంగాణలో బీజేపీ రాష్ట్రస్థాయి నేతలు మాత్రం పవన్ ను లైట్ తీసుకుంటున్నారన్న టాక్ ఉంది. అప్పటి నుంచి ఏపీ బీజేపీ నేతలకు, పవన్ కు మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా బీజేపీతో గ్యాప్ ఉన్న విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న పవన్...మీడియాతో మాట్లాడుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కారణంగా ఆత్మహత్య చేసుకున్న జనసేన కార్యకర్త వెంగయ్యనాయుడు కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. వెంగయ్య కుటుంబానికి రూ. ఎనిమిదిన్నర లక్షల ఆర్థిక సాయం అందించారు. అన్నా రాంబాబుపై చర్యలు తీసుకోవాలని ప్రకాశం ఎస్పీకి పవన్ లేఖ అందజేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీ, జనసేనల మధ్య గ్యాప్ ఉందని టాక్ వచ్చింది. మొదట జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ ...ఆ తర్వాత బీజేపీకి మద్దతిచ్చి తప్పుకోవడంతో జనసేన కార్యకర్తలు సైతం నిరుత్సాహపడ్డారు. దీనిపై, తెలంగాణలో రాజకీయ నేతలు పవన్ పై విమర్శలు గుప్పించారు. ఇక, తిరుపతి లోక్ సభ స్థానానికి జరగబోతోన్న ఉప ఎన్నికలోనైనా పోటీ చేసి సత్తా చాటాలనుకున్న పవన్ ఆశలపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నీళ్లు చల్లారని అనుకుంటున్నారు. తిరుపతి అభ్యర్థిపై బీజేపీ, జనసేనలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని పవన్ ప్రకటించారు. అయితే, తిరుపతిలో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారంటూ సోము మరో ప్రకటన చేశారు. తమను సంప్రదించకుండానే బీజేపీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో పవన్ నిరుత్సాహపడ్డారు. ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానం దృష్టికి కూడా పవన్ తీసుకువెళ్లారట. దీంతో, ఆ వ్యవహారంపై ఏపీ బీజేపీ నేతలు కూడా సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీతో ఉన్న గ్యాప్ ప్రచారంపై పవన్ వ్యాఖ్యానించారు. ఏపీ బీజేపీ నేతలతో కొంత గ్యాప్ ఉన్న విషయాన్ని పవన్ అంగీకరించారు. మరి, బీజేపీ, జనసేనల మధ్య ఉన్న గ్యాప్ త్వరలోనే ఫిల్ అవుతుందా.. లేక తిరుపతి ఉపఎన్నికతో మరింత పెరుగుతుందా అన్నది తేలాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News