రాష్ట్ర రాజకీయాలు రెండిళ్ల మధ్య జరిగితే కుదరదు: పవన్

Update: 2021-10-02 11:33 GMT
ఆఖరి శ్వాస వరకూ రాజకీయాల్లోనే ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఈ పోరాటంలో తాను ప్రాణాలు కోల్పోతే తన మట్టిని దేశం నలుమూలలా చల్లాలంటూ జనసైనికులకు పిలుపునిచ్చారు. జనసేన తలపెట్టిన ‘శ్రమదానం’ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ పూర్తి చేశారు. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి మొదలుకొని బహిరంగ ప్రాంగణానికి వెళ్లేంత వరకూ అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.

‘ఎలా అడ్డుకుంటారో చూద్దాం.. శ్రమదానం చేసి తీరుతాం.. సభ నిర్వహించే ఇక్కడ నుంచి కదులుతాం’ అంటూ పోలీసులకు కారు ఎక్కి మరీ సవాల్ విసిరారు. మరోవైపు అభిమానులు, కార్యకర్తలు ఏ మాత్రం తగ్గకుండా భారీగానే సభకు తరలివచ్చారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.

అభిమానులు, కార్యకర్తలు ఏ మాత్రం తగ్గకుండా భారీగానే సభకు తరలివచ్చారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ప్రశ్నించే వాడంటే అధికార పక్షానికి భయం పట్టుకుందన్న పవన్ కళ్యాణ్.. అందుకే నేనంటే వైసీపీ భయమన్నారు. ప్రశ్నించాలంటూ మొదట్నుంచీ నేను ప్రజలను మొత్తుకునేది అందుకేనన్నారు పవన్ కళ్యాణ్. సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు జనసేనాని. తనకు అన్నం పెట్టిన ప్రజల రుణం తీర్చుకోవడానికే పాలిటిక్స్ లోకి వచ్చానన్నారు.

ప్రజల కోసమే నేను తిట్లు తింటున్నానని.. నా కోసమైతే ఎప్పుడో వాళ్ల తోలు తీసేవాడినని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక తిడితే ఊరుకునేది లేదన్న జనసేనాని ఆడైనా మగయినా సరే తోలు తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు.

రాష్ట్ర రాజకీయాలు రెండిళ్ల మధ్య జరిగితే కుదరదన్న పవన్ కళ్యాణ్.. ఒక కులాన్ని వర్గ శత్రువుగా చేసుకొని వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. అందుకే రోడ్లు లేవు.. జీతాలు పెన్షన్లు రావని ఎద్దేవా చేశారు. బైబిల్ చేత్తో పట్టుకొని తిరిగే వాడిని కాదని.. గుండెల్లో పెట్టుకుంటానన్నారు. కాపు, ఒంటరి, తెలగలు, బలిజలు ముందుకు వస్తే తప్ప రాజకీయాల్లో మార్పు రాదని సూచించారు. నాలుగు కులాలు పెద్దన్న పాత్ర పోషిస్తే తప్ప మిగిలిన కులాలకు సాధికారిత రాదని హితవు పలికారు. దుష్ట పాలన అంతం కావాలంటే ప్రతీ ఒక్కరూ ఏకం కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడు.

ఏపీలో ప్రజాస్వామ్య బద్దంగా పనులు జరగడం లేదని పవన్ ఆరోపించారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మన హక్కు అన్నారు. పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ఉందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరూ అడ్డుకోలేరన్నారు. ప్రజలకు ఉన్న హక్కును ఎవరూ ఆపలేరన్నారు. తొక్కే కొద్ది పైకిలేస్తాం తప్ప తగ్గేది లేదని స్పష్టం చేశారు.

రాజకీయాలు నాకు సరదా కాదు.. బాధ్యత.. నేను సీఎం కావాలని మనసులో కోరుకోండి.. రాజకీయాలు నాకు వ్యాపారం కాదు.. త్వరలోనే అధికారంలోకి వస్తామని వెల్లడించారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేయడం సరికాదని పవన్ హితవు పలికారు.




Tags:    

Similar News