భీమ్లా నాయ‌క్ : జ‌న‌సేనానితోనే టీఆర్ఎస్..ఇది ఫిక్స్ భ‌య్యా!

Update: 2022-03-02 01:30 GMT
వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల విష‌య‌మై అప్పుడే ఏమీ తేల‌లేదు. ఆ క‌త్తుల వంతెన‌పై క‌వాతు అన్న‌ది అంత సులువు కాద‌ని ఇప్ప‌టికే ఎన్నో సార్లు తేలిపోయింది.ఆంధ్రాలో టీడీపీతో వెళ్లినా వెళ్ల‌కున్నా.,బీజేపీతో  వెళ్లినా వెళ్ల‌కున్నా తాము మాత్రం తెలంగాణ వాకిట కేసీఆర్ తో ప‌నిచేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.విజ‌య‌వాడ‌లో తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ ను తొల‌గించినంత మాత్రాన వైసీపీ గెలిచింద‌ని భావించ‌రాద‌ని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

కేసీఆర్ పై త‌మ‌కు ఉన్న అభిమానంతోనే ఆ రోజు తాము భీమ్లా నాయ‌క్ విడుద‌ల సంద‌ర్భంగా ఫ్లెక్స్ ఏర్పాటు చేశామ‌ని,ఇదే అభిమానం రేప‌టి వేళ కూడా కొన‌సాగిస్తామ‌ని ప‌వ‌న్ అభిమానులు ఘంటాప‌థంగా చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆంధ్రావ‌ని రాజ‌కీయాల్లో అటు జ‌గ‌న్ కానీ ఇటు ప‌వ‌న్ కానీ నువ్వా నేనా అన్న విధంగానే ఉన్నారు. భీమ్లా నాయ‌క్ వివాదం ఇప్ప‌ట్లో స‌మ‌సిసోయాలా లేదు.జ‌గ‌న్ ఇచ్చిన జీఓ కార‌ణంగా ఐదు రూపాయ‌ల‌కు,ప‌ది రూపాయల‌కు టిక్కెట్లు అమ్మ‌లేక చాలా సెంట‌ర్లు మూసుకుపోయాయి.

తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం న‌ష్ట‌పోయిన డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను ఆదుకునేందుకు ప‌వన్ త‌న రెమ్యున‌రేష‌న్ నుంచి ప‌దిశాతం డ‌బ్బులు కేటాయించార‌ని,అదేవిధంగా ప్రొడ‌క్ష‌న్ హౌస్ త‌ర‌ఫున మ‌రో ప‌ది శాతం ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.

అంటే మొత్తం ఇర‌వై శాతం మేర‌కు న‌ష్టాల‌ను నిర్మాత మ‌రియు హీరో క‌లిసి మోయ‌నున్నారు. ఇదే స‌మ‌యంలో న‌ష్టాల మాట ఎలా ఉన్నా వైసీపీ మంత్రులు ప‌రిధి దాటి ఇష్టానుసారం మాట్లాడ‌డ‌మే త‌మను బాధ‌పెడ్తోంద‌ని అంటున్నారు జ‌న‌సైనికులు.

ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ వ్యాఖ్య‌లు  అస్స‌లు స‌మంజ‌సంగా లేవ‌ని అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు. అదేవిధంగా కొడాలి నాని లాంటి మంత్రులు మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌వ‌న్ ను ఉద్దేశించి స్థాయి కూడా ఆలోచించ‌కుండా మాట్లాడుతున్నార‌ని ఇది కూడా త‌మ‌ను ఎంత‌గానో వేధిస్తోంద‌ని అంటున్నారు.

ఈ ద‌శ‌లో ఆంధ్రాలో త‌మ సినిమా బ‌తికేందుకు ఏ పాటి అవ‌కాశాలు కూడా లేవు అని తేల్చేస్తున్నారు జ‌న‌సేన అభిమానులు.అందుకే  కొన్ని రోజులు ఆంధ్రాలో  కొత్త సినిమాలు విడుద‌లపై డైలమా ఉండ‌డం ఖాయ‌మ‌ని కూడా అంటున్నారు జ‌న‌సేన అభిమానులు.

ఇదే త‌రుణంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌మ‌కు ఐదో షో వేసుకునేందుకు అనుమ‌తి ఇచ్చార‌ని,అదే విధంగా టికెట్ రేటు కూడా అక్క‌డ బీ,సీ సెంట‌ర్ల లో కూడా న్యాయంగానే ఉంద‌ని అంటున్నారు.ఈ ద‌శ‌లో తెలంగాణ‌లో జ‌న‌సేన మ‌రియు టీఆర్ఎస్ క‌లిసి ప‌ని చేయ‌నుంద‌నే తేలిపోయింది.గ‌త ఎన్నిక‌ల్లో కూడా ప‌రోక్షంగా ప‌వ‌న్ త‌ర‌ఫున మ‌నుషులు కేసీఆర్ కు సాయం చేశార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. క‌థ‌నాలు వెలుగు చూశాయి. త‌మ‌ను ప్రోత్స‌హించే కేసీఆర్ కు తాము అండ‌గా ఉంటామ‌ని, ఆంధ్రాలో మాత్రం జ‌గ‌న్ పై ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని శ‌ప‌థం చేస్తున్నారు ప‌వ‌న్ అభిమానులు.
Tags:    

Similar News