జనసేన అర్ధ సెంచరీ.. ఏ పార్టీకి షాక్...?

Update: 2022-10-02 05:28 GMT
ఏపీలో జనసేన పొజిషన్ ఏంటి అంటే మిత్రులుగా ఉందామనుకుంటున్న వారూ లేక ఆగర్భ శత్రువుగా చూస్తున్న వారు సైతం లైట్ గా తీసుకుంటారు. జస్ట్ ఆరు శాతం ఓట్లు మాత్రమే కదా 2019 ఎన్నికల్లో జనసేనకు వచ్చినది అని తేలిగ్గా చూస్తారు. కానీ ఆ ఎన్నికల తరువాత పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఏపీలో వైసీపీ ఏలుబడిని జనాలు చూశారు. ఆ మోజు బాగా తగ్గిపోతోంది. ఇక తెలుగుదేశం పార్టీ కూడా పాత కాపే. అందువల్ల కొత్తగా పెట్టిన జనసేన వైపు జనాల మొగ్గు బాగానే ఉంది అన్న అంచనాలు ఉన్నాయి.

ఏపీలో జనసేన సొంతంగా పోటీ చేస్తే కచ్చితంగా డబుల్ నంబర్ లో సీట్లు గెలుచుకోవడమే కాకుండా దాదాపుగా 50 సీట్ల దాకా   టీడీపీని దెబ్బ తీసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఉత్తరాంధ్రాతో మొదలుపెడితే రాయలసీమ దాకా ఆయన జిల్లాల్లో జనసేన టీడీపీని ఇబ్బంది పెట్టేలా తన బలాన్ని పెంచుకుంటోంది అని చెబుతున్నారు.

విశాఖలో ఎనిమిది సీట్లలో జనసేన ప్రభావం గణనీయంగా ఉంది. ఈ సీట్లలో టీడీపీ విజయావకాశాలనే ఆ పార్టీ దెబ్బకొడుతుంది అని అంటున్నారు. విజయనగరంలో ఒక సీట్లో జనసేన బలంగా ఉంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం 24 సీట్లలో జనసేన తాను బలంగా ఉంది. అయితే ఒంటరిగా పోటీ చేస్తే తాను గెలవకపోయినా టీడీపీని మాత్రం ఇక్కడ దెబ్బ తీస్తుందని అంచనాలు ఉన్నాయి.

అలాగే క్రిష్ణా గుంటూర్ జిల్లాలలో మరో పది సీట్లలో జనసేన కారణంగా టీడీపీ నష్టపోతుందని అంటున్నారు. నెల్లూరు ప్రకాశంలో నాలుగైదు  సీట్లలో చిత్తూరులో ఒక సీట్లో, కర్నూలో రెండు, అనంతపురంలో ఒక సీట్లో జనసేన టీడీపీకి పక్కలో బల్లెంగా ఉంది అని అంటున్నారు. ఇలా మొత్తంగా చూసుకుంటే దగ్గర దగ్గర యాభై సీట్లలో జనసేన తాను గెలవకపోయినా టీడీపీ ఓటు బ్యాంక్ ని మాత్రం దారుణంగా డిస్టర్బ్ చేస్తుందని లెక్కలు అయితే చెబుతున్నాయి.

దాంతో పాటు ఒంటరిగా పోటీ చసినా రెండు పదుల సంఖ్యలో సీట్లు జనసేనకు దక్కుతాయని ఆ పార్టీ వారు అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు పొత్తులకు జనసేన సుముఖమే అంటున్నారు. అయితే తాము కోరిన సీట్లు ఇస్తేనే అది సాధ్యమని చెబుతున్నారు. తమ వల్ల యభై దాకా సీట్లలో నష్టం వాటిల్లుతుందని అంచనా ఉన్నపుడు తమతో పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా 50 సీట్లు ఇచ్చినా టీడీపీ కూడా అత్యధికంగా లాభపడుతుంది కదా అన్నదే జనసేన వాదనగా కనిపిస్తోంది.

అయితే టీడీపీ మాత్రం ఈ వాదనతో ఏకీభవించడంలేదు అని అంటున్నారు. పాతిక సీట్ల నుంచి గరిష్టంగా ముప్పయి సీట్లు జనసేనకు ఇచ్చి పొత్తులు పెట్టుకోవాలన్నది ఆ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే ఈ నంబర్ పట్ల జనసేనలో అసంతృప్తి ఉంది అని అంటున్నారు. తాము సొంతంగా పోటీ చేసినా ఇరవై దాకా సీట్లు వస్తాయని, అలాగే అనేక నియోజకవర్గాలల్లో తమకంటూ క్యాడర్ ఏర్పడుతుంది అని జనసేన భావిస్తోంది.

ఇక తాము సోలోగా  పోటీలో ఉంటే టీడీపీ గెలుపు అవకాశాలు బాగా తగ్గిపోతాయని కూడా చెబుతున్నారు. ఏపీలో వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్న కోరిక ఏదీ తమకు లేదని, కానీ అదే సమయంలో తమ పార్టీ విస్తరణను, బలాన్ని తగ్గించుకుని మరీ త్యాగాలు చేయాల్సిన పరిస్థితి కూడా లేదని జనసేన వర్గాలు అంటున్నాయి. తమ బలం బాగా పెరిగిందని దాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడితేనే పొత్తులు సాఫీగా కుదురుతాయన్నది జనసేన ఆలోచంగా ఉంది.

తమకు 2024లో డబుల్ డిజిట్ సీట్లు వచ్చినా బలమైన ప్రతిపక్షంగా ఉంటామని, అనేక నియోజకవర్గాలలో పటిష్టంగా ఉంటామని అది 2029 నాటికి బాగా ప్లస్ అవుతుందని కూడా జనసేన కొత్త లెక్కలు వేసుకుంటోందిట. అదే టీడీపీ కనుక 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే మాత్రం రాజకీయంగా ఇబ్బంది పడుతుందని జనసేన అంచనా వేస్తోందిట. అందువల్ల తమకు పొత్తులు ఉన్నా ఇష్టమే లేకపోయినా లాభమే అన్నట్లుగా జనసేన నేతల మనోగతం ఉంది.

మొత్తానికి చూస్తూంటే  అవసరం, అనివార్యత అన్నీ టీడీపీకే ఉన్నాయి కాబట్టి ఆ పార్టీయే పొత్తుల విషయంలో బాగా తగ్గి రావాలని, తాము కోరుకున్న సీట్లు ఇవ్వాలన్నది జనసేన వ్యూహంగా కనిపిస్తోంది. అటే యాభై సీట్లకు తక్కువ కాకుండా జనసేనకు ఇస్తేనే పొత్తు కుదురుతుంది అన్నట్లుగా ఆ పార్టీ ఆలోచనలు సాగుతున్నట్లుగా చెబుతున్నారు. మరి టీడీపీ ఇంత పెద్ద నంబర్ లో సీట్లు జనసేనకు ఇచ్చేందుకు ఇష్టపడకపోవచ్చు అన్నది అవతల వైపు వాదన. ఏది ఏమైనా ఈసారి జనసేనతో పొత్తు అంటే చాలా లెక్కలు ఉంటాయన్నది ఏతా వాతా తేలుతున్న వాస్తవం.
Tags:    

Similar News