మేం కూడా టీఆర్ఎస్ లాగే.. ప‌వ‌న్ పోలిక‌.. !

Update: 2021-09-25 06:30 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌న పార్టీని తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌తో పోల్చుకున్నారు. ఇది ఇప్పుడు విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. తాజాగా ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు సంబంధించి.. ప‌వ‌న్‌.. మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. త‌న పార్టీ పుంజుకుంటోంద‌ని చెప్పారు. బిందువుగా ప్రారంభ‌మైన త‌న పార్టీ సింధువుగా మారుతోంద‌ని అంటున్నారు. 2019 ఎన్నికల్లో గ‌ట్టి పోటీ ఇచ్చామ‌ని చెప్పిన ఆయ‌న‌.. ఒక స్థానంలో గెలిచినా.. సంతోషంగానే ఉంద‌ని చెప్పారు. ఇక‌,గ్రామ పంచాయ‌తీ, మునిసిపాలిటీ, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో పార్టీ పుంజుకుంద‌న్నారు.

అయితే.. ఈ పుంజుకోవ‌డాన్ని ఆయ‌న పొరుగున ఉన్న తెలంగాణ స‌ర్కారు పార్టీ టీఆర్ ఎస్‌తో  పోల్చుకు న్నారు. గ‌తంలో టీఆర్ ఎస్ కూడా ఇలానే ఒక‌టొక‌టిగానే ప్ర‌స్థానం ప్రాంభించింద‌న్న ప‌వ‌న్‌.. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చింద‌న్నారు.  సో.. తాము కూడా ఇలానే పుంజుకుంటుంద‌ని తెలిపారు. అయితే.. దీనిపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప‌వ‌న్ చెప్పిన ప్ర‌కారం.. టీఆర్ఎస్ ఒంట‌రిగానే పుంజుకున్నా.. 2001లో ప్రారంభ‌మైన పార్టీ.. 2012 వ‌చ్చే స‌రికి అంటే.. కేవ‌లం పుష్క‌ర కాలంలో ప్ర‌త్యామ్నాయం లేని పార్టీగా అవ‌త‌రించింది. మ‌రి ఆ త‌ర‌హా ప‌రిస్థితి జ‌న‌సేన‌కు ఉందా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

అంతేకాదు.. 2014లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చేశారు. ఇక‌, గ‌త 2018 ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న అధికారం చేప‌ట్టారు. మ‌రి ఈ త‌ర‌హాలో ప‌వ‌న్ త‌న పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేయ‌గ‌ల‌రా. అంతేకాదు.. టీఆర్ ఎస్ పార్టీని డెవ‌ల‌ప్ చేసేందుకు నిత్యం కేసీఆర్ ప్ర‌జ‌ల్లో ఉన్నారు. ఎండావానా లెక్క‌చేయ‌కుండా..  ప్ర‌జ‌ల్లో తిరిగారు.. ఉద్య‌మాన్ని నిర్మించారు. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల్లోకి వెళ్లిపోయారు. మ‌రి ఇదంతా.. చేసేందుకు జ‌న‌సేన‌కు అవ‌కాశం ఉందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. నిజ‌మే.. ఒక‌ప్పుడు ఉండేదే.. ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని  ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లి ఉంటే.. నిజంగానే టీఆర్ ఎస్ త‌ర‌హా ప‌రిస్థితి ఉండేది.

అదే స‌మ‌యంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విష‌యంలో పోరాటం చేసి ఉంటే ఉండేది. కానీ, వీటిని వ‌దిలేసి.. ఎక్క‌డిక‌క్క‌డ క‌ప్ప‌ల త‌క్కెడ మాదిరిగా.. 2014లో బీజేపీతో, టీడీపీతో పోత్తు పెట్టుకున్న ప‌వ‌న్‌.. 2019లో ఒంట‌రిగా పోటీగా చేశారు. ఇక‌, ఆ త‌ర్వాత మ‌ళ్లీ త‌గుదున‌మ్మా అంటే.. ఏపీకి అన్యాయం చేసింద‌ని ఆయ‌నేచెప్పిన బీజేపీ తో జ‌త క‌లిశారు. మ‌రి ఇవ‌న్నీ.. కేసీఆర్‌చేశారా?  తెలంగాణ‌ను వ‌ద్ద‌న్న పార్టీల‌ను ఏకేశారు. నాయ‌కుల‌కు వ‌ణుకు పుట్టించారు. ఈ త‌ర‌హా.. ఉద్య‌మం చేయ‌బ‌ట్టే.. బిందువుగా  ప్రారంభ‌మైనా.. కేసీఆర్ హ‌వా.. నిజంగానే సింధువైంది.

అలాంటి టీఆర్ ఎస్ పార్టీతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పోలిక పెట్టుకుంటే.. క‌ష్ట‌మేనని అంటున్నారు ప‌రిశీల‌కులు. పోనీ.. పోలిక పెట్టుకున్నా.. ఈ త‌ర‌హా ఉద్య‌మాలు చేస్తారా?  సినీ రంగాన్ని వ‌దిలేసి.. బ‌య‌ట‌కు రాగ‌ల‌రా? అనేది మిలియ‌న్ డాల‌ర్  ప్ర‌శ్న‌. మ‌రి ఏ ఉద్దేశంతో పోలిక పెట్టుకున్నారో చూడాలి.
Tags:    

Similar News