జనతా కర్ఫ్యూ సూపర్ సక్సెస్

Update: 2020-03-22 11:00 GMT
కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం తలపెట్టిన జనతా కర్ఫ్యూ సూపర్ సక్సెస్ అయింది. అంచనాలను మించి జనాలు క్రమశిక్షణ పాటించి ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు జనాలు ఇళ్లకు పరిమితం కావాలని.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎవ్వరూ బయటికి రాకూడదని ప్రధాని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఐతే జనాలు ఈ పిలుపును ఏమేర స్వాగతిస్తారు.. ఎంత వరకు నియంత్రణ పాటిస్తారు అన్న సందేహాలు నెలకొన్నాయి. మన దేశంలో ఇలాంటి క్రమశిక్షణ సాధ్యం కాదనే భావించారు. కానీ ఆశ్చర్యకరంగా దేశ్యవాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ప్రజలు గొప్ప క్రమశిక్షణ పాటించారు. ఇళ్లు దాటి బయటికి రాలేదు. బయట దుకాణాలన్నీ మూత పడ్డాయి. చిన్న చిన్న వీధులు కూడా బోసిపోయి కనిపించాయి. హైదరాబాద్ నగరంలో ప్రధాన కూడళ్లన్నీ నిర్మానుష్యంగా మారి సరికొత్తగా కనిపించాయి. నగరంలో దాదాపుగా అన్ని దుకాణాలూ మూతపడ్డాయి. ఏ ప్రాంతంలోనూ జనాలు కనిపించలేదు.

ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో భాగం కావడంతో.. దేశ వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. వాహనాలు, రైళ్లను రద్దు చేశారు. విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. మరోవైపు కరోనా కట్టడి దిశగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక జనతా కర్ఫ్యూలో భాగంగా ఢిల్లీ, హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో మెట్రో రైలు సర్వీసులు ఆపేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జనాల రాకపోకల్ని అడ్డుకునేందుకు పోలీసులు గస్తీ కాశారు. ఐతే హైదరాబాద్ సహా కొన్ని నగరాల్లో కొంతమంది బయట సొంత వాహనాల్లో తిరుగుతండగా.. వారికి దండాలు పెట్టి, పుష్పగుచ్ఛాలు అందించి పోలీసులు బయట తిరగొద్దని హితవు చెప్పడం విశేషం.
Tags:    

Similar News