కామెడీ కాదు నిజం.. ఆ సిటీలో షాపింగ్ కు మగాళ్లకే అనుమతి?

Update: 2020-04-25 03:45 GMT
వినేందుకు వింతగా ఉన్నా ఇది నిజం. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వేళలో.. వింతలకు.. విడ్డూరాలకు ఏ మాత్రం కొదవలేని రీతిలో కొన్ని నిర్ణయాల్ని తీసుకుంటున్నారు పాలకులు. ఆ కోవలోకే వస్తుంది తాజా నిర్ణయం. కరోనా వేళ.. ప్రపంచంలోని పలు దేశాలు లాక్ డౌన్ నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. ఇలాంటి వేళలో నిత్యవసర వస్తువుల కొనుగోలుకు వీలుగా కొన్ని షాపులు.. సూపర్ మార్కెట్లను తెరిచి ఉంచుతున్న సంగతి తెలిసిందే. జపాన్ లోని అతి పెద్ద నగరాల్లో మూడోదైన ఒసాకా నగర మేయర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా న్యూస్ గా మారిపోయింది.

లాక్ డౌన్ వేళలో.. తమ నగరంలోని షాపులకు షాపింగ్ చేయటానికి మగవాళ్లకు మాత్రమే అనుమతిస్తూ విచిత్రమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎందుకిలా? అన్న ప్రశ్నకు ఆయన ఠకీమని సమాధానమిస్తూ.. షాపింగ్ చేసే సమయంలో మగాళ్లు పది నిమిషాల్లో పూర్తి చేస్తే.. మహిళలు మాత్రం అందుకు భిన్నంగా షాపింగ్ అంటూ ఎక్కువసేపు సమయాన్ని తీసుకుంటారని.. అందుకే కరోనా వేళలో షాపింగ్ చేయటానికి మహిళలకు తమ నగరంలో అనుమతిని ఇవ్వట్లేదని పేర్కొన్నారు.

కరోనా వేళ సామాజిక దూరాన్ని పాటించటంతో పాటు.. బయట ఎక్కువగా తిరగకుండా ఉండేందుకు వీలుగా తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఒసాకో మేయర్ తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో డెవలప్ అయినట్లుగా బిల్డప్ ఇచ్చే జపాన్ లో.. మహిళలకు సామాజిక స్వేచ్ఛ చాలా తక్కువన్న విమర్శలు ఉన్నాయి. షాపింగ్ చేయటానికి మహిళలకు అనుమతి నో అన్న మాట చాలు.. జపాన్ లో మహిళల పట్ల పాలకులకు ఎంత చిన్నచూపు ఉందో ఇట్టే అర్థం కాక మానదు.
Tags:    

Similar News