ప్రధాని మోడీ సతీమణి నిరాహార దీక్ష చేశారు

Update: 2016-02-13 06:27 GMT
సాంకేతికంగా చూస్తే ప్రధాని మోడీ సతీమణి జశోదాబెన్ అన్నది అందరికి తెలిసిందే. ఈ విషయాన్ని మోడీనే తన ఎన్నికల నామినేషన్ పత్రాల్లో స్పష్టంగా పేర్కొనటం మర్చిపోకూడదు. టెక్నికల్ గా మాత్రమే అర్థాంగి అయిన జశోదాబెన్ ను మోడీ అలానే చూడగా.. మొదట్లో ఆమె మాత్రం కాస్తంత తగ్గి మోడీ కానీ తనను ఆహ్వానిస్తే ఆయన దగ్గరకు వెళ్లటానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అయితే.. దీనికి సంబంధించి ఎలాంటి స్పందన మోడీ నుంచి రాలేదు.

ఇదిలా ఉంటే.. అప్పుడప్పుడు వార్తల్లోకి వచ్చే జశోదాబెన్ తాజాగా ఒక అంశంపై గళం విప్పటమే కాదు.. అధికారుల వైఖరికి నిరసనగా నిరాహార దీక్ష చేయటం గమనార్హం. మహారాష్ట్రలోని ముంబయి మహానగర మురికివాడల్లో తాత్కాలిక నివాసాల్ని తొలగించే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ.. ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. అధికారుల తీరును తప్పుపడుతూ నిరాహార దీక్ష చేశారు. గుడ్ సమారిటన్ మిషన్ ట్రస్ట్ తరఫున ఆమె దీక్ష నిర్వహించారు.

మోడీ భార్యగా ప్రధాని నివాసంలో ఉండనప్పటికీ.. సాంకేతికంగా చూస్తే ప్రధాని భార్య ఏకంగా రోడ్డు మీదకు వచ్చిన నిరాహార దీక్ష చేశారు. ఏకంగా ప్రధాని సతీమణి రోడ్డు మీదకొచ్చి దీక్ష చేసిన నేపథ్యంలో ఆమె డిమాండ్ చేస్తున్న అంశంపై అధికారులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News