రజనీ ఏమైనా సెన్సార్ బోర్డా?

Update: 2018-11-15 13:09 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని మాత్రమే ప్రకటించారు. ఇంకా రాజకీయాల్లోకి రాలేదు. కానీ అప్పుడే ఆయనకు రాజకీయ పరమైన వేడి గట్టిగా తాకుతోంది. రజనీ లాంటి స్టార్ నుంచి అభిమానులు దూకుడుతో కూడిన రాజకీయాలు ఆశిస్తారు. నిక్కచ్చిగా అభిప్రాయాలు చెప్పాలని కోరుకుంటారు. కానీ ఆయన మాత్రం మెతక వైఖరి అనుసరిస్తున్నారు. ఒక మాటపై ఉండట్లేదు. తన అవగాహన రాహిత్యాన్ని కూడా చూపిస్తున్నారు. తద్వారా అన్ని వైపులా విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాజీవ్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించే విషయమై స్పందించమని మీడియా వాళ్లు అడిగినపుడు.. ఏ ఏడుగురు అని ప్రశ్నించడం.. ఆ తర్వాతి రోజు కూడా ఈ అంశంపై సరిగా మాట్లాడలేకపోవడంతో రజనీ పై పెద్ద ఎత్తున సెటైర్లు పడ్డ సంగతి తెలిసిందే.

ఆల్రెడీ సామాజిక మాధ్యమాల్లో ఆయన ట్రోల్ అవుతున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఆయన్ని టార్గెట్ చేసుకున్నారు. తమిళనాడు మంత్రి జయకుమార్ రజనీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రజనీ సినిమాల్లో మాత్రమే హీరో అని.. బయట ఆయన జీరో అని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు ఆయన పనికి రారని అన్నారు. ముఖ్య విషయాలపై రజనీకి అవగాహన లేదని.. దీంతో ఆయన వ్యాఖ్యల్ని చూసి జనాలు నవ్వుతున్నారని అన్నారు. రజనీకి సొంతంగా ఆలోచించే.. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేదని.. ఎక్కువగా వేరే వ్యక్తులపై ఆధారపడుతున్నారని.. అందుకే ఈ సమస్య అని అభిప్రాయపడ్డారు. రజనీ వేగంగా రాజకీయాల నుంచి బయటికి వెళ్లిపోతారన్నారు. ఇక బీజేపీ.. ఇతర పార్టీల గురించి రజనీ తన అభిప్రాయాలు చెప్పడంపై స్పందిస్తూ.. రజనీ ఏమైనా సెన్సార్ బోర్డా రాజకీయ పార్టీల్ని సర్టిఫై చేయడానికి అని జయకుమార్ ప్రశ్నించారు.
Tags:    

Similar News