ఆ పార్టీ అన్నాడీఎంకేలో విలీనం..

Update: 2019-08-20 10:19 GMT
త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త జ‌య‌ల‌లిత మృతి త‌ర్వాత త‌మిళ రాజ‌కీయాల్లో ప‌లు ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. జ‌య మృతి త‌ర్వాత సీఎం పీఠం కోసం - ఆమె వార‌స‌త్వం కోసం అక్క‌డ అనేక పార్టీలు పుట్టుకు వ‌చ్చాయి. ఇక సీఎం పీఠం కోసం కూడా అమ్మ వీర విధేయుడు ప‌న్నీరు సెల్వంతో పాటు ప‌ళ‌నిస్వామి పోటీప‌డ్డారు. సందులో స‌డేమియాలా అటు దిన‌క‌ర‌న్‌తో పాటు ఇటు జ‌య మేన‌కోడ‌లు దీపా జయకుమార్.. కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు.

ఆమె రాజ‌కీయ పార్టీ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే భ‌ర్త‌తో ఆమెకు తీవ్ర‌మైన విబేధాలు వ‌చ్చాయి. ఈ క్రమంలోనే ఆమె వ్య‌క్తిగ‌తంగా కూడా డిస్ట‌ర్బ్ అయ్యింది. ఇక కొద్ది రోజులుగా దీప తన పార్టీని ఏఐఏడీఎంకేలో విలీనం చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గ‌త ఏప్రిల్‌ లో జ‌రిగిన లోక్‌ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఆమె పార్టీ పోటీ చేయకుండా... అన్నాడీఎంకే అభ్య‌ర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

ఇక కొద్ది రోజులుగా విలీనం వార్త‌ల‌పై స్పందిస్తూ ఆమె త‌న పార్టీని ఏఐఏడీఎంకేలో విలీనం చేయబోతున్నట్లు ప్రకటించారు. కొద్ది రోజుల క్రిత‌మే దీప తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తన రాజకీయ జీవితం నిరుత్సాహానికి గురిచేసిందని దీపా వ్యాఖ్యానించారు. అంతేకాదు, మహిళలు రాజకీయాల్లో మనుగడ సాగించడం కష్టసాధ్యమని పేర్కొన్నారు.

ఇక తాజాగా పార్టీని వీలీనం చేస్తూ ప్ర‌క‌ట‌న చేశారు. అమ్మ మ‌ర‌ణాంత‌రం ఆమె అభిమానులు కొంద‌రు త‌న ఇంటికి వ‌చ్చి రాజ‌కీయాల్లోకి రావాల‌ని కోర‌డంతోనే తాను రాజ‌కీయాల్లోకి రావాల్సి వ‌చ్చింద‌ని... ఈ క్ర‌మంలోనే తాను  ‘ఎంజీఆర్‌ అమ్మ దీప పెరవాయి’ అనే నూతన పార్టీని ప్రారంభించినా వ్య‌క్తిగ‌తంగా మాత్రం రాజ‌కీయ జీవితం త‌న‌కు ఎంత మాత్రం సంతృప్తి ఇవ్వ‌లేద‌ని చెప్పారు.

ఇక ఇటీవ‌ల నా ఆరోగ్యం కూడా స‌హ‌క‌రించ‌డం లేద‌ని... అందుకే పార్టీ కోసం ఎక్కువ స‌మ‌యం కేటాయించ‌డం కుద‌ర‌డం లేద‌న్న దీప పార్టీ విలీనం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. పార్టీ విలీనంపై త‌మ కేడ‌ర్ కూడా సంతృప్తితోనే ఉంద‌ని చెప్పారు. విచిత్రం ఏంటంటే ఇదే ప‌ళ‌నిస్వామి - ప‌న్నీరు సెల్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించిన దీప ఇప్పుడు త‌మ పార్టీని వాళ్ల అధీనంలోనే ఉన్న త‌న అత్త పార్టీలో క‌లిపేస్తున్నారు.


Tags:    

Similar News