సెల్ ఫోన్లు అంద‌రి చేతుల్లో ఉంటాయి జేసీ!

Update: 2019-04-01 09:08 GMT
సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌టం అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డికి మామూలే. క‌డుపులో ఉంచుకున్న‌ది దాచుకోలేని త‌త్త్వం ఆయ‌న‌కు ఎక్కువే. దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు.. కోపం వ‌స్తే వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడ‌టం ఆయ‌న‌కు అల‌వాటు. జేసీ జ‌మానాలో రాజ‌కీయాలు వేరుగా ఉండేవి. అప్ప‌ట్లో ఏం చేసినా న‌డిచేది. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేదు. అంద‌రి చేతుల్లోకి సెల్ ఫోన్లు వ‌చ్చేశాయి.

ఇలాంటివేళ‌.. నోటిని కాస్త అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉంది. సెల్ ఫోన్ల వీడియోలు.. సోష‌ల్ మీడియాలు లాంటివి జేసీకి తెలుసో లేదో తెలీదు కానీ..తాజాగా నిర్వ‌హిస్తున్న ఎన్నిక‌ల ప్ర‌చారంలో కోపం తో చిందులు తొక్కేశారు. ఊహించిన రీతిలో ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన బూతు మాట‌ల‌కు అవాక్కు అయ్యే ప‌రిస్థితి.

ఈసారి ఎన్నిక‌ల్లో త‌న కొడుకును పోటీకి దింపిన ఆయ‌న‌.. హామీల మీద హామీలు ఇస్తూ ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌జ‌ల్లో పెరిగిన చైత‌న్యాన్ని గుర్తించ‌టంలో వెనుక‌బ‌డిన జేసీకి.. ఎవ‌రైనా త‌మ స‌మ‌స్య‌ల గురించి ప్ర‌శ్నిస్తుంటే మాత్రం కాలిపోతోంది
.
ఇలాంటి ప‌రిస్థితే తాజాగా చోటు చేసుకుంది. తాజాగా త‌న ప్ర‌చారంలో భాగంగా ఒక సామాన్యుడు తాగునీటి స‌మ‌స్య గురించి ప్ర‌స్తావించారు. పుట్టూరులో త‌మ‌కు ఎప్పుడు మెజార్టీ రాలేద‌న్న జేసీ.. త‌మ‌కు మెజార్టీ ఇస్తేనే చెరువుల‌కు నీళ్లు నింపుతామ‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

తాగేందుకు నీళ్లు లేవంటూ వ‌డ్డెర కాల‌నీకి చెందిన వెంక‌ట‌నారాయ‌ణ అనే సామాన్యుడు ఎంపీ దృష్టికి తీసుకురాగా.. ఆయ‌న‌పై వీరావేశాన్ని ప్ర‌ద‌ర్శించి.. తాగి నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌తావా? అంటూ మండిప‌డ్డారు. నిన్ను తాపి పంపినోడు ఎవ‌రంటూ రాయ‌లేని బూతుమాట‌ల్ని మాట్లాడేశారు.

గ‌తంలో ఇలాంటివి వాటి విష‌యంలో ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. తాజాగా మాత్రం చేతిలో వ‌చ్చిన సెల్ ఫోన్ ను వాడేసి.. జేసీ బూతుపురాణాన్ని రికార్డు చేసి.. సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్తా ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. పాత రాజ‌కీయాలు ఆపేసి.. కొత్త త‌ర‌హా రాజ‌కీయాలు స్టార్ట్ చేయ‌కుండా దెబ్బ ప‌డుతుంద‌న్న విష‌యాన్ని జేసీకి ఎవరో ఒక‌రు చెప్పాలి. అది ఆయ‌న కొడుకు అయితేనే బాగుంటుంది. సోష‌ల్ మీడియా ఒక‌టి ఉంద‌ని.. దాని కార‌ణంగా జ‌రిగే న‌ష్టం గురించి జేసీకి ఆయ‌న కొడుకు వివ‌రిస్తే మంచిదంటున్నారు.


Full View



Tags:    

Similar News