కొంపముంచుతున్న బాబు సహనం : జేసీ

Update: 2018-02-06 06:14 GMT
‘మా ముఖ్యమంత్రి మహానుభావుడు.. ఆయనకు సహనం చాలా ఎక్కువ... ఎంత కాలం ఆగినా సరే.. వాళ్లు చేసేది ఏమీ లేదని మేమందరం గూడా చెప్పినాం..  అయినా ఇంకా జూస్తాం.. ఇంకా జూస్తాం..  అని ఆయనకు పాపం ఆశ చాలా ఎక్కువ.. కానీ ఇక్కడ వీరు చేసేదేం లేదు.. మా ముఖ్యమంత్రి సహనమే మా కొంపముంచుతోంది...’’ ఇవీ రాష్ట్ర ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు. ప్రధాని నరేంద్రమోడీ తో అపాయింట్ మెంట్ లభించి.. తెలుగుదేశం ఎంపీలు ఆయనను కలవడానికి వెళ్లబోయే కాసేపు ముందు పార్లమెంటు వద్ద ఆయన వెల్లడించిన అభిప్రాయం ఇది.

సాధారణంగా ప్రధానితో అపాయింట్ మెంట్ దొరికిన తర్వాత తెలుగుదేశం ఎంపీలు కొంత సంయమనం పాటించడం ధర్మం. ఎందుకంటే.. ఏకంగా ప్రభుత్వ పెద్దతోనే భేటీ కాబోతున్నప్పుడు.. ఏకంగా ప్రధాని నుంచే ఏదో ఒక హామీ పొందగల అవకాశం ఉంటుందనే ఆశ ఉంటుంది గనుక.. ప్రధానితో భేటీకి వెళ్లబోతూ.. పుల్లవిరుపు మాటలు మాట్లాడడం అనేది సాధారణంగా జరగకూడదు. కానీ.. పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత.. ప్రధానితో భేటీకి వెళ్లడానికి ముందు మీడియాతో మాట్లాడిన తెదేపా ఎంపీలు ముగ్గురు నలుగురు కూడా.. ఇదే రకం అసహనాన్నే వ్యక్తం చేయడం విశేషం. మిత్రపక్షంగా అసలు ఉండాల్సిన అవసరం ఏమిటి? మిత్రపక్షంగా ఉండడం గురించే మేం పునరాలోచించుకుంటున్నాం.. అంటూ వాళ్లు దాదాపు ముక్తకంఠంతో ఆగ్రహించడం విశేషం.

జేసీ దివాకర్ రెడ్డి మాటలను బట్టి.. ఆదివారం ఎంపీలతో జరిగిన సమావేశంలోనే.. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు న్యాయం చేసే ఉద్దేశంతో గానీ - తమ పార్టీని గౌరవప్రదంగా చూసే ఉద్దేశంతో గానీ లేదనే అభిప్రాయాన్ని ఎంపీలంతా అధినేతకు చెప్పినట్లుగానే కనిపిస్తోంది. అయినా సరే వేచి చూసే ధోరణి అవలంబిద్దాం అని చంద్రబాబు చెప్పడం వల్లనే.. తెదేపా ఎంపీలు కాస్త మెతకగా స్పందించి కొద్దిపాటి నిరసనలు తెలియజేశారు. కాకపోతే.. సోమవారం నాడు రాజ్‌ నాధ్‌ తో భేటీ తర్వాత.. వారికి మరింత క్లారిటీ వచ్చినట్లుగా ఉంది. ఇవాళ తమ పోరాటాన్ని మరింతగా ఉధృతం చేస్తున్నారని  విశ్లేషకులు భావిస్తున్నారు. 
Tags:    

Similar News