జగన్ దీక్షకు రూ.2కోట్లు ఖర్చు అయ్యిందా?

Update: 2015-08-11 08:59 GMT
ఏపీకి ప్రత్యేక హోదా కోసం సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరసన చేయటం తెలిసిందే.  ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేయటంతో పాటు.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పెద్దగా ప్రయత్నాలు చేయలేదన్న అపప్రదను పోగొట్టుకునేలా వ్యవహరించటం తెలిసిందే.

ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. పార్టీ నేతలతో భారీగా నిరసన నిర్వహించటంతో పాటు.. నాటకీయంగా.. పార్లమెంటు ముట్టడి గురించి అప్పటికప్పుడు వెల్లడించి.. పోలీసులకు తిప్పలు పెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను ఎంతగానో తపిస్తున్నట్లుగా చేయటంలో జగన్ సక్సెస్ అయ్యారని ఆయన పార్టీ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే.

అయితే.. దీనిపై ఏపీ అధికారపక్ష ఎంపీ.. సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మాత్రం మరోలా చెబుతున్నారు. ఢిల్లీలో జగన్ నిర్వహించిన నిరసన దీక్షకు రూ.2కోట్లు ఖర్చు అయ్యిందంటూ ఆసక్తికరమైన లెక్క ఒకటి చెప్పుకొచ్చారు. దీక్ష వల్ల జగన్ కు ప్రచారం వచ్చిందే తప్ప.. ఫలితం రాలేదని వ్యాఖ్యానించారు. నిరసన దీక్ష కోసం రూ.2కోట్లు ఖర్చు చేశారని.. దీనివల్ల జగన్ ఏం ఆశించారో ఆ ఫలితం మాత్రం దక్కలేదన్నారు.

దీక్షలకు కాలం చెల్లిందని.. వాటి వల్ల ఎలాంటి ప్రభావం లేదని జేసీ సింఫుల్ గా కొట్టేశారు. మరి.. అధికారంలో లేనప్పుడు.. ప్రస్తుతం ఆయన బాస్ చంద్రబాబు తరచూ దీక్షలు.. నిరసనలు చేసే వారు కదా? మరి.. వాటి వల్ల లాభం లేకపోతే.. ఈ రోజు సీఎం అయ్యేవారా..?
Tags:    

Similar News