ఇలాంటి ఆలోచనలు జేసీకే వస్తాయి

Update: 2015-12-29 10:05 GMT
ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపిరి కట్టేది ఒక దారి అంటారు. రాజకీయాల్లోనూ కొందరు అలాంటివారు ఉంటారు. అందరూ ఒకలా మాట్లాడితే వారు ఒకలా మాట్లాడి నిత్యం వివాదాలకో, సంచలనాలకో కారణమవుతుంటారు. అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి కూడా అదే టైపు. ఆయన నోరు విప్పితే సంచలనాలే. ఒక్కోసారి ఆయన సొంత పార్టీనే టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా ఆయన సొంత ప్రొఫెషన్ పైనే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు... అందరూ నియోజకవర్గాలు పెరగాలి, పదవులు పెరగాలి అని కోరుకుంటున్న తరుణంలో అసలు ఎంపీ - ఎమ్మెల్యేల పదవులు అనవసరం... ముఖ్యమంత్రులను, ప్రధాన మంత్రులను డైరెక్టుగా ఎన్నుకోవాలి అంటున్నారు.
   
దేశంలో ఎంపీలు - ఎమ్మెల్యేల అవసరం లేదని జేసీ అన్నారు. ప్రధానమంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానం ఉంటే మంచిదని వ్యాఖ్యానించారు. జేసీ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. గతంలో రూ. 5 పెట్టి టీ కొంటున్నప్పుడు రూపాయికే చౌకధర బియ్యం ఎందుకివ్వాలని ప్రశ్నించారాయన. అలాగే ఉచిత విద్యుత్ పరిమిత స్థాయిలోనే ఉండాలని గతంలో అభిప్రాయపడ్డారు. ఉపాధి పథకం వ్యవసాయానికి అనుసంధానిస్తేనే ఉపయోగం ఉంటుందని జేసీ వ్యాఖ్యానించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితుల్లో రాదని కుండబద్ధులు కొట్టారు.    

అంతేకాదు.. దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు స్తబ్థత ఉందని.. ఏపీలోనూ అదే పరిస్థితని ఆయన గతంలో అన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌ ను వీడి ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలని ఓసారి కోరారు.  తాజాగా ఆయన దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేల అవసరం లేదని తేల్చేశారు.  అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రు లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానం ఉంటే మంచిదని వ్యాఖ్యానించి రాజ కీయవర్గాల్లో సంచలనం రేపారు.
Tags:    

Similar News